నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజల ప్రాణాలు కాపాడటంలో, వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ విమర్శించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులు తనను ఆవేదనకు గురిచేశాయనీ, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం అవిశ్రాంతంగా చర్యలు చేపట్టిందంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు సమాధానంగా కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. కేవలం బాధపడతున్నట్టుగా, ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రకటనలు చేస్తే సరిపోదని రాహుల్‌కు సూచించారు. తెలంగాణలో నిజంగా ప్రభుత్వం తరఫున చేయాల్సిన సహాయక కార్యక్రమాలను చిత్తశుద్ధితో చేస్తున్నారో లేదో తెలుసుకుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం తెలుస్తుందని రాహుల్ గాంధీకి చురకంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ఛిన్నాభిన్నామైందని తెలిపారు. నిజంగా తెలంగాణపై శ్రద్ధ ఉండి ఉంటే ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యపు, తప్పుడు చర్యలను మీరెందుకు తప్పుబట్టలేదంటూ రాహుల్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న ఉద్దేశ పూర్వక నిర్లక్ష్యం కారణంగా ప్రజల్లో రోజురోజుకు ఆ పార్టీపై విశ్వాసం సన్నగిల్లుతోందని పేర్కొన్నారు. వరదల్లో ప్రాణ నష్టం, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు చేతగాని ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను దేవుడే కాపాడాలంటూ ప్రభుత్వ పెద్దలే మాట్లాడుతుంటే…ఇంకా మీ ప్రభుత్వం ఉండి ప్రయోజనమేంటనీ రాహుల్ గాంధీని కేటీఆర్ నిలదీశారు.