బడ్జెట్‌పై సర్కారు ఫోకస్‌

Government focus on budget– శాఖలవారీగా ప్రతిపాదనలకు ఆదేశం..18 నుంచి సమీక్షలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌పై ఫోకస్‌ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి ఆయా శాఖల నుంచి బడ్జెట్‌ ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ ప్రతిపాదనలను కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకనుగు ణంగా ప్రతిపాద నలు పంపించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఆరు గ్యారంటీల అమలుకు ఆయా శాఖలు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. మరోవైపు బడ్జెట్‌ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఈనెల 18 నుంచి ఆర్ధికశాఖ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనుంది. బడ్జెట్‌ కసరత్తులో భాగంగా అన్ని శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరింది. మంత్రులు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. రోజుకు ఇద్దరు మంత్రులతో కలిసి చొప్పున డిప్యూటీ సీఎం ఆయా శాఖలపై సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో గ్యారంటీలు, ఎన్ని కల హామీల అమలుకు పద్దు కేటాయింపులపై చర్చించనున్నారు. అలాగే ఉద్యోగ నియామాకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్‌ అకౌంట్‌కు వెళ్తుందా? లేదా పూర్తి బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుందా? అనేది విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.