– 1300 మందిపై త్వరలో వేటు ?
– సీఎం పరిశీలనలో దస్త్రం
– అవసరమైన వారి కొనసాగింపు
– అవినీతి మరకలున్న వారికి ఉద్వాసన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఉద్యోగ విరమణ చేసి ఎక్స్‌టెన్షన్‌పై సర్వీసులో ఇంకా కొనసాగుతున్న అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే వారిపై సర్కారు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయా ప్రభుత్వ శాఖల నుంచి పూర్తిసమాచారం తెప్పించుకున్న ప్రభుత్వం కొరడా ఝలిపించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఉద్యోగ విరమణ చేసి సర్వీసులో కొనసాగుతున్న వారిలో ఆయా శాఖ హెచ్‌వోడీలతోపాటు అఖిల భారత సర్వీసు(ఏఐఎస్) అధికారులు ఉన్నారు. దాదాపు 40 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 120 మంది హెచ్‌వోడీలు ఉన్నట్టు సమాచారం. అలాగే పదుల సంఖ్యలో ఏఐఎస్‌లు ఉన్నారు. వీరి గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ద్వారా నివేదిక తెప్పించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నారు. క్లీన్‌చిట్ ఉంటే ఆయా శాఖల్లో అవసరాలను బట్టి కొందరిని కొనసాగించే పరిస్థితులు ఉన్నాయి. అలాగే మరికొందరి విషయంలో కఠినంగా వ్యవహరించాలని రేవంత్ సర్కారు భావిస్తున్నది. సాగునీటి శాఖ, రెవెన్యూ, సర్వే, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, సింగరేణి, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యుత్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ తదితర శాఖలతోపాటు ఇతర డిపార్ట్‌మెంట్లల్లో పనిచేస్తున్న వారు సుమారు 1500 మంది ఉంటారని సమాచారం. వీరిలో దాదాపు 200 మంది లోపు ఆయా స్థాయి అధికారులు ప్రభుత్వానికి అవసరమని ఉన్నతాధికారులు సిఫారసు చేసినట్టు సమాచారం. వీరి పనితీరు, హోదా ఆధారంగా కొనసాగించాలా ? వద్దా ? అనే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. మిగతా 1300 మందికి ఉద్వాసన తప్పదని అధికారులు చెబుతున్నారు. వీరందరిపై ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నట్టు తెలిసింది. ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని ఇంటికి పంపాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎన్నికల ప్రచారంలోనే అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ ఎక్స్‌టెన్షన్ అధికారులను తొలగిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక నెల రోజులకు ఉద్యోగ విరమణ చేసిన అధికారుల వివరాలను తెప్పించుకున్నారు. నివేదిక సీఎంవోకు వచ్చి దాదాపు నెల దాటింది. ఈనేపథ్యంలో త్వరలోనే వీరిపై చర్యలు తీసుకోవచ్చని సచివాలయం వర్గాలు చెబుతున్నాయి.