
– జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన సంఘటన
– సమస్య అంతా మంత్రిని కలవడంవల్లే
– కాంట్రాక్ట్ ఏజెన్సీని వెంటనే తొలగించాలని సిబ్బంది డిమాండ్
– సమస్య అంతా మంత్రిని కలవడంవల్లే
– కాంట్రాక్ట్ ఏజెన్సీని వెంటనే తొలగించాలని సిబ్బంది డిమాండ్
– వారంతా సేఫ్ గానే ఉన్నారు
– విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాను
– జిజిహెచ్ సూపరింటెండెంట్ నిత్యానంద్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. నిత్యం ఏదో ఒక సంఘటన చోటుచేసుకుని వార్తల్లోకి ఎక్కడం పరపాటిగా మారింది.గత కొద్దిరోజుల క్రితమే జిజిహెచ్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఓ కాంట్రాక్టర్ నుండి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ సంఘటన మరవకముందే శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గత కొంతకాలంగా పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది ఆత్మహత్యాయత్ననికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సాయి సెక్యూరిటీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కింద గత కొన్ని ఏళ్ల నుండి నల్లగొండ పట్టణానికి చెందిన వల్కి లలిత, మారం నాగమణి లు శానిటేషన్ వర్కర్లుగా, బోడ జానకి పేషంట్ కేర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా యూనియన్ తరపు నుండి ఇటీవలే జిజిహెచ్ కు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ గోడును చెప్పుకున్నారు. జీతాలు సమయానికి ఇవ్వటం లేదని, వచ్చే తక్కువ జీతంలో కూడా కోతలు విధిస్తున్నారని, సెలవులను ఇవ్వడం లేదని వాపోయారు. విషయంపై స్పందించిన మంత్రి నిబంధనల మేరకు సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా కొంత సమయాన్ని తీసుకున్నప్పటికీ ఇదే కారణంగా ఏజెన్సీ నిర్వాహకులు వారిని విధుల నుంచి తొలగించారు. గత రెండు నెలలుగా సిబ్బంది ఎవరికీ వేతనాలు అందలేదు. కానీ ఈ ముగ్గురి సిబ్బందికి మాత్రం 29వ తేదీన జీతాలను వేసిన ఏజెన్సీ నిర్వాహకులు వారిని విధుల నుంచి తొలగించారు.
సిబ్బంది మాత్రం రోజువారి విధులలో భాగంగా శుక్రవారం ఉదయమే డ్యూటీకి వచ్చారు. అయితే ముగ్గురు సిబ్బంది మాత్రం హాజరు రిజిస్టర్ లో తమ పేర్లు లేకపోవడాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని యూనియన్ సభ్యులతో చెప్పగా వారంతా మూకుమ్మడిగా క్యాజువాలిటీ ఎదుట ధర్నాకు దిగారు. గంటకు పైగా ధర్నా చేసిన ఎవరు స్పందించకపోవడంతో సిట్రీజన్ మాత్రలను వేసుకొని ముగ్గురు సిబ్బంది ఆత్మహత్యనికి పాల్పడ్డారు. విషయాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే అదే ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం సూపరిండెంట్ పర్యవేక్షణలో వారికి చికిత్స చేస్తున్నారు. కాగా గత సంవత్సరం క్రితం ఓ ఉద్యోగిని విధుల నుండి తొలగించారని అతన్ని విధులలోకి తీసుకోవాలని మంత్రి ద్వారా ఒత్తిడి తేవడం కూడా ఈ ముగ్గురి సిబ్బందిని తొలగించడానికి ప్రధాన కారణంగా ఆస్పత్రి సిబ్బంది చర్చించుకుంటున్నారు.


మంత్రి ఆదేశాలు పక్కకు పెట్టి: ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్, ఏజెన్సీ నిర్వాహకులకు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు.అయినా కూడా ఏజెన్సీ నిర్వాహకులు తమకేమీ పట్టనట్టు మంత్రి ఆదేశాలను పక్కనపెట్టి తమ ఇష్టాను రీతిగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి సిబ్బంది ఒక్కరికి మొత్తం జీతం 15,600 రూపాయలు. అందులో రూ. 12093 లను సిబ్బంది ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.రూ.3023 పిఎఫ్, 484 కు పైగా ఈఎస్ఐ కట్టాల్సి ఉంది. కానీ సదరు ఏజెన్సీ నిర్వాహకులు నెలకు కేవలం 11,000 రూపాయలను మాత్రమే వారి ఖాతాలో జమ చేస్తూన్నారు. సుమారు 1000 రూపాయలు మాత్రమే పీఎఫ్ కడుతున్నారని, ఈఎస్ఐ కూడా కట్టాల్సిన అంత కట్టడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మొబైల్ కు ఎప్పుడు కూడా మెసేజ్ రాలేదని, ఈమధ్యనే మెసేజ్ వస్తుండడంతో అసలు ఎంత మొత్తం చెల్లిస్తున్నారో వెళ్లడైందని పేర్కొంటున్నారు.
ఇప్పటికే పలు ఏజెన్సీలపై ఆరోపణలు: నల్లగొండ జిల్లాలో ఉన్న పలు ఏజెన్సీలపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ నిబంధన ప్రకారం చెల్లించడం లేదని పలు శాఖలలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది పేర్కొంటున్నారు. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి, నల్లగొండ మున్సిపాలిటీ లకు సంబంధించిన ఏజెన్సీలపై ఫిర్యాదులు కూడా చేశారు. వాస్తవానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంది. కానీ ఇప్పటివరకు ఏ జిల్లా కలెక్టర్ కూడా అలా చేసిన దాఖలాలు లేవు. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు తాము ఆడింది ఆట.. పాడింది పాటగా మారిపోయింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ విషయంపై విచారణ జరిపించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

కలెక్టర్ దృష్టికి విషయం: డాక్టర్ నిత్యానంద్ (జిజిహెచ్ సూపరింటెండెంట్)..
మొదటగా ఏజెన్సీ నిర్వాహకులు వెంకన్న నాకు కాల్ చేసి ధర్నా చేస్తున్నట్లు చెప్పారు. ఏమైనా ఉంటే మాట్లాడదాం మొదట డ్యూటీలోకి వెళ్ళమని చెప్పాలని నేను చెప్పాను.ఉదయం 9:15 గంటల కు నేను రౌండ్స్ కి వెళ్లే సమయం. ఆ సమయంలో ముగ్గురు సిబ్బంది (ఆంటీ ఎలర్జీ) సిట్రీజన్ టాబ్లెట్స్ మింగేశారు. అక్కడే ఉన్న డాక్టర్ చికిత్స అందించారు. వారంతా ప్రస్తుతం బాగానే ఉన్నారు. మిగతా సిబ్బందికి ఎమర్జెన్సీ సర్వీసును ఆపవద్దని, సమస్యలు ఏమైనా ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుందామని చెప్పాను. విషయాన్ని జిల్లా కలెక్టర్ కు తెలియపరిచాను. జిజిహెచ్ పై వస్తున్న ఆరోపణలు వాస్తవమే. పలు ఆరోపణలకు సంబంధించిన వివరాలు జిల్లా యంత్రాంగానికి తెలుసు. విచారణ చేసి సరైన సమయంలో చర్యలు తీసుకుంటారు.
