– కల్లుగీత కార్మికులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించాలి :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వారు తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది చనిపోతున్నారనీ, గాయాలపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద నివారణ కోసం ఎలాంటి చర్యల్లేవని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 బడ్జెట్‌లో గీత కార్మికులకు కేటాయించిన నిధులను ఖర్చు చేయడం లేదని పేర్కొన్నారు. తక్షణమే ఆ నిధులను గీతకార్మికుల సంక్షేమానికి వినియోగించాలనీ, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. వృత్తి ప్రమాదకరమైనప్పటికీ బతుకుదెరువు కోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడాదికి సుమారు 180 మంది ప్రమాదాల్లో మరణిస్తున్నారని వివరించారు. కాళ్లు, చేతులు విరిగి జీవనాధారాన్ని కోల్పోతున్నారని తెలిపారు. భద్రత కల్పిస్తామనీ, గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇస్తామన్న ప్రభుత్వ వాగ్దానాలు నెరవేరకపోవడంతో వారు తీవ్ర నిరాశతో ఉన్నారని పేర్కొన్నారు. కావున ప్రభుత్వం ప్రకటించిన హామీలను చిత్తశుద్ధితో అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా యధావిధిగా కొనసాగిస్తూనే ఇటీవల ప్రకటించిన గీతన్న బీమాను అమలు చేయాలని కోరారు. బీసీ వృత్తిదారులకు ఇచ్చిన జీవో నెంబర్ ఐదు ప్రకారం కల్లుగీత వృత్తి చేస్తున్న వారందరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.