– పరిశ్రమలకేమిస్తారు? యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?: కేటీఆర్ ట్వీట్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ భూములను ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెడితే పరిశ్రమలకు భూములెలా కేటాయిస్తారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ప్రశ్నించారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలకు భూములు కేటాయించకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రేవంత్ సర్కారుకు రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేత కావడం లేదని విమర్శించారు. నిధుల సమీకరణకు ప్రమాదకరమైన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖకు చెందిన రూ.20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల భూములను తనఖా పెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం ఉందని చెప్పారు.. ఇందుకోసం మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను ఉపయోగించుకుని రూ.100 కోట్లు కమిషన్ ఇచ్చేందుకు సిద్ధపడిందని తెలిపారు. హస్తం నాయకుల మతిలేని చర్యల కారణంగా రాష్ట్ర ప్రగతి శాశ్వతంగా కుంటుపడుతుందని తెలిపారు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా యువత ఉద్యోగావకాశాలు కోల్పేయే ప్రమాదముందని హెచ్చరించారు.
కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తుంటాయనీ కేటీఆర్ గుర్తుచేశారు. అలాంటి చోట 400 ఎకరాలు ప్రయివేటు సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అని ఆక్షేపించారు. గత ఏడు నెలలుగా పారిశ్రామిక రంగం స్థబ్దుగా మారి, పెట్టుబడులు రాక, సరైన ప్రోత్సాహం లేక కంపెనీలు కూడా పక్కచూపులు చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెట్టడం తగదని కేటీఆర్ హితవు పలికారు.