– మందులు అడిగితే లేవంటారు
నవతెలంగాణ-పెన్‌పహాడ్
సాధారణంగా ప్రజారోగ్యానికి పంపిణీ చేయాలని ప్రభుత్వం మందులను సమకూర్చి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మండలంలోని ఆరోగ్య ఉపకేంద్రాలలో రోగులకు పంపిణీ చేసేందుకు మందులను పంపిణీ చేస్తుంటారు. అలా పంపిణీ చేసిన మందులను అవసరాల మేరకు ఉపకేంద్రాలకు పంపిణీ చేసి రోగులకు అందేవిధంగా చూస్తూ ఉంటారు. అయితే రోగులకు అందించాల్సిన మందులను సద్వినియోగం అయ్యే విధంగా చూడకుండా, గడువు ముగిసే వరకు ఉపకేంద్రాలకు పంపిణీ చేయకుండా, వాటిని గడువు ముగిసే వరకు పక్కకి పడేసి కప్పిపుచ్చుకునేందుకు ఆరోగ్య ఉపకేంద్రంలో దాచిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలకేంద్రంలోని ప్రాథమికఆరోగ్య కేంద్రానికి ఉపకేంద్రాలకు పంపిణీ చేసేందుకు కరోనా సమయంలో విడుదల చేసిన మందులు, అవే కాకుండా నీరసానికి ఉపయోగించే గ్లూకోజ్ సెలైన్ బాటిళ్లను, ఇతర వ్యాధులు ప్రబలకుండా ఉపయోగించే మందులను, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఉపకేంద్రాలకు పంపిణీ చేయకుండా పక్కకు పడేశారు.మందుల గడువు ముగిసేలోపు వాటిని ఉపయోగించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా అలాంటివేమీ తీసుకోకపోవడంతో గడువు ముగిసిన మందులు సుమారు పది బస్తాలలు, డబ్బాలలో కుప్పలు కుప్పలుగా మందుల షీట్లు, సిట్రోజన్, పారాసెటమల్, ఐరన్, కాల్షియం, మెట్రోజిల్, బిపి, షుగర్, టానిక్ బాటిళ్లను, గ్లూకోజ్ సెలైన్ బాటిళ్లను, సిరంజీలను ఎవరికి అనుమానం రాకుండా లింగాల సబ్ సెంటర్‌లో దాచిపెట్టారు.అయితే ప్రజలకు పంచాల్సిన ఈ మందులు ప్రజలకు చేరకుండా.. ఉపకేంద్రాలకు సరఫరా చేయకుండా.. ఒక ఉపకేంద్రంలో దాచి ఉంచడంతో ఉపకేంద్రంలో ఎందుకు దాచారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే పీహెచ్‌సీకి అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించేందుకు తరచూ వచ్చివెళ్తుంటారని, వారికి తెలిస్తే తమ ఉద్యోగాలకు భద్రత కరువవుతోందని ఉపకేంద్రంలో దాచి ఉంచారని, మోడల్ పీహెచ్‌సీ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోగా ఆ చెకింగ్ సమయంలో ఉపకేంద్రానికి తరలించి ఉండవచ్చని అనుమానాలున్నాయి.పీహెచ్‌సీకి ఉపకేంద్రాలకు మందుల కోసం వెళితే మందులు లేవని, బయట తీసుకోవాలని చిట్టీలు రాస్తు.. పంపిణీ చేయాల్సిన మందులను ఈ విధంగా వధా చేయడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ హర్షవర్ధన్
సదరు మందులను గ్రామాల్లోని ఉపకేంద్రాలకు, రోగులకు, ప్రజలకు పంచాలి.వృథా చేయొద్దు. మందులను గడువుకు మూడు నెలల ముందు నుండే చర్యలు తీసుకోవాలి. మందులు ఈ విధంగా వృథా అయినట్టు తమ దృష్టికి రాలేదు.ఘటనపై విచారణ జరుపుతాం.