ప్రభుత్వ కార్యక్రమం.. పార్టీ ప్రచారం

కో – ఆప్షన్ సభ్యుడు అభ్యంతరం…

– దురుసుగా ప్రవర్తించిన బీఆర్ఎస్ కార్యకర్తలు…
– బిసి లబ్ధిదారుల చెక్కులు పంపిణీలో రసాభాస….
నవతెలంగాణ – అశ్వారావుపేట
బీసీ లబ్ధిదారులకు రూ.లక్ష చెక్కులు పంపిణీలో ఎన్నికల ప్రచారం లా మరొక్క సారి సీఎం,ఎమ్మెల్యే గారిని గెలిపించాలని అశ్వారావుపేట జెడ్.పి.టి.సి వరలక్ష్మి చేసిన ప్రసంగానికి అభ్యంతరం తెలిపిన అశ్వారావుపేట మండల పరిషత్ కాంగ్రెస్ కో – ఆప్షన్ సభ్యుడు ఎస్.కే పాషా పై బీఆర్ఎస్ చెందిన నక్కాబు, యుగంధర్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో స్వల్ప రసాభాస చోటు చేసుకుంది.అప్రమత్తం అయిన పోలీస్ సిబ్బంది ఆయనను బయటకు పంపారు. వాస్తవానికి ఇది ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే చెక్కులు పంపిణీ.ప్రొటోకాల్ ప్రకారం పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులను,అధికారులను మాత్రమే వేదిక పై ఆహ్వానం పలుకుతారు. కానీ అశ్వారావుపేట ఎం.పి.పి.శ్రీరామ మూర్తి అయిదు మండలాలు ప్రజాప్రతినిధులను,బీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు ముందుగా ఆహ్వానించారు.అనంతరం ఎంపీడీఓ, తహశీల్దార్ లను వేదిక పైకి పిలిచారు.  మొదటిగా అశ్వారావుపేట జెడ్.పి.టి.సి వరలక్ష్మి మాట్లాడుతూ పథకాలు అన్నీ బాగున్నాయని కావున మళ్ళీ సీఎం,ఎమ్మెల్యేలను గెలిపించాలని ఎన్నికల ప్రచారం ప్రసంగం లా కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ కో – ఆప్షన్ సభ్యుడు పాషా ఇది ఎన్నికల ప్రచారం కాదని,ప్రభుత్వం కార్యక్రమం అని అభ్యంతరం తెలిపారు.దీంతో దమ్మపేట కు చెందిన యుగంధర్,అశ్వారావుపేట కు చెందిన నక్కా రాంబాబు అనే బీఆర్ఎస్ కార్యకర్తలు నీవు ఎవరు ఇక్కడ మాట్లాడటానికి అంటూ ఎదురు దాడికి దిగారు.ఇది గమనించిన పోలీస్ సిబ్బంది ఇరువురిని విడదీసి గొడవ పెద్దది కాకుండా చేసారు. ఇలాంటి వారి వల్ల ఎమ్మెల్యే మెచ్చా అప్రతిష్ట పాలు అవుతున్నారని కొందరు గుసగుసలు ఆడారు.