– జగదీశ్‌రెడ్డి ధ్వజం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజా సమస్యల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎంత తప్పించుకున్నా ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రజలపై పడిందని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చేసిందని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరుతో బడాబాబులకు దోచిపెట్టే కుట్రకు తెరతీసిందని ఆరోపించారు. లగచర్లలో రైతులపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తోందని తెలిపారు. జైలులో ఉన్న లగచర్ల గిరిజన రైతులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు. లగచర్ల ఘటనపై చర్చకు కోరితే ప్రభుత్వం పారిపోయిందని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కాదన్న విషయం గుర్తించాలని ఆయన సూచించారు. స్పీకర్ తమ నోరు నొక్కుతు న్నారని బూతులు తిట్టేవారికే అవకాశం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 1,913 జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లున్నాయని తెలిపారు. ఈ జీరో ఎన్‌రోల్‌మెంట్‌పై చర్చించాలని కోరారు. విద్యాలయాలపై తమ ప్రశ్నను చర్చకు అనుమతించలేదని పేర్కొన్నారు. గురుకులాలు అంటే ఈ ప్రభుత్వానికి కేసీఆరే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది రెండు లక్షల మంది పిల్లలు తక్కువగా చేరారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. కేవలం పది మంది విద్యార్థులున్న పాఠశాలలు దాదాపు నాలుగు వేలున్నాయని చెప్పారు. పది మందిలోపు విద్యార్థులున్న స్కూళ్ల టీచర్లను వేరే చోటికి బదిలీ చేస్తున్నారని విమర్శించారు. దాదాపు ఆరు వేల స్కూళ్లు మూసివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఎత్తేసిందన్నారు. విషాహారం, కుక్క, పాముకాట్లతో గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు. అటు అసెంబ్లీలో.. ఇటు బయట ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని తెలిపారు. తాము స్కూళ్లకు వెళ్లి చూస్తామంటే కూడా అనుమతించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమైందన్నారు. విద్యారంగానికి సంబంధించి కాంగ్రెస్ 20 హామీలు ఇచ్చిందని తెలిపారు. కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్పారు. మూసివేయాలని చూస్తున్న స్కూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించాలని సూచించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ కల్లు గీత వృత్తిని నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గీత కార్మికులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. డ్రగ్స్ నియంత్రణ, నివారణపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండాను ఖరారు చేయడం దారుణమని విమర్శించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజరుతో కలిసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అసెంబ్లీలో చర్చించాల్సింది టూరిజంపై కాదని లగచర్లలో రైతులను అక్రమంగా అరెస్టు చేయడంపైనని ఎద్దేవా చేశారు.