ప్రభుత్వ స్కీంలా..? బీఆర్ఎస్ పథకాలా..?

– కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై
– సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనల
– సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ- జనగామ
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నవి ప్రభుత్వ స్కీంలా..? లేదా బీఆర్ఎస్ పథకాలా…?? అని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా మంగళవారం సీపీఎం బచ్చన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్, అధ్యక్షత వహించగా సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనక రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రకటించే పథకాలు మోసపూరి పథకాలని వాటిని ప్రజలు నమ్మొద్దని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. అలాగే దేశంలో కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు రాయితీలిస్తూ సామాన్యలపై భారాలు వేస్తుందన్నారు. రైతు రుణాలు రెన్యువల్ అయినా కాకపోయినా కొర్రీలు పెట్టకుండా 2018 నవంబర్ 11 కు ముందు ఉన్న రుణాలన్నింటిని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.  మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలపై విపరీతమైన భారాలను మోపుతోందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పథకాల అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. 2018లో ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ వడ్డీలకే సరిపోతుందన్నారు. వడ్డీలు చెల్లించకపోతే రుణమాఫీ వర్తించదని, కొత్త రుణాలు ఇవ్వమనడంతో రైతులు ప్రైవేట్ గా అప్పుచేసి వడ్డీలు చెల్లించారన్నారు.