ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మహిళా సంఘాలదే..!

– అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటుకు అవగాహన
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మహిళా సంఘాలకు నిర్వహణ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. గతంలో పాఠశాలల చైర్మన్ గా విద్యార్థుల తల్లిదండ్రులు ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాఠశాలల మౌలిక వసతులు కల్పిస్తూ, విద్యార్థుల సంఖ్య పెంచుతూ అన్ని విధాల సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక చేపట్టింది.ఈ కమిటీ ముఖ్యంగా పది అంశాల పై పనిచేయాల్సి ఉంటుంది. ఐదు క్లాసులో ఉన్నట్లయితే 15 మంది కమిటీ మెంబర్ లు, వివో అధ్యక్షురాలు కమిటీ చైర్మన్ గా  స్కూల్ ప్రధానోపాధ్యాయులు కన్వీనర్ గా నిర్ణయించారు. పాఠశాలలో కమిటీల ఏర్పాటులో ముగ్గురిని ఎస్సీ ఎస్టీ మెంబర్ లుగా తప్పకుండా ఉండేలా నిర్ణయించింది.
కమిటీలఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: మహిళా సంఘాల సీ సీ , సీఏ లకు అవగాహన ఎంపీడీవో పులుగు వేణుగోపాల్ రెడ్డి: హుస్నాబాద్ మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పేరుతో నూతన కమిటీలను వేసేందుకు మహిళా సంఘాల సీసీలు, సిఐలు చర్యలు చేపట్టాలని హుస్నాబాద్ ఎంపీడీవో పులుగు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సంఘాల సి సి లు, సీఏ లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రాథమిక మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం, బాలికల మరుగుదొడ్ల నిర్మాణం తాగునీటి సౌకర్యాలు కల్పించడం,చిన్న మరియు పెద్ద మరమ్మతు పనులు చేపట్టడం పై వివరించారు.ఇప్పటికే ఉన్న పనిచేయని టాయిలెట్లు పునరుద్ధరణ, తరగతి గదుల విద్యుదీకరణ, పాఠశాల ప్రాంగణంలో పారిశుధ్యం నిర్వహణ, విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు సోలార్ ప్యానల్ ఏర్పాటు అమ్మ ఆదర్శ కమిటీ లదే బాధ్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో,ఏపిఎం శ్రీనివాస్, ఎంపీఓ సత్యనారాయణ, ఏఈపిఆర్ స్నేహ, సీసీలు విద్యాశాఖ నుండి సి ఆర్ పి లు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.