నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు వైద్య శాఖ సిబ్బంది ప్రజల్ని అప్రమత్తతపరచి తగు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుదవారం హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను మండల కమిటీ ముఖ్య నాయకులతో కలిసి సందర్శించారు. పి.హెచ్.సి లో పనిచేస్తున్న సిబ్బందిని చికిత్స కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న నూతన ప్రైమరీ హెల్త్ సెంటర్ ను భవనాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు మరింత వైద్య సదుపాయాన్ని అందించాలని అన్నారు. అనంతరం పోతారం ఎస్ లోని మండల ప్రాథమిక పాఠశాలలోని మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న టాయిలెట్ బిల్లుల్ని మరియు మధ్యాహ్న భోజన బిల్లుని వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు చంచల ఎల్లన్న, మండల నాయకులు, మీడియా ఇంచార్జ్ మొలుగురి శేఖర్, శ్రీనివాస్, బోయిని శంకర్ తదితరులు పాల్గొన్నారు.