గ్రామపంచాయతీలకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి

– ఎప్.టి.ఎల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
           గత మార్చి నుండి గ్రామ పంచాయతీల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వము నుండి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో గ్రామాలలో చాలా సమస్యలు పేరుకపోయాయని, అభివృద్ధి కుంటుపడిందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము  గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, గ్రామ చెరువు పరిదిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్న మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
. మంగళవారం సీపీఐ(ఎం) అనాజిపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి పంచాయతీ కార్యదర్శి స్వాతికి వివిధ సమస్యలను పరిష్కరించాలని మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ ప్రత్యేక అధికారుల పాలన, నిధుల లేమితో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రోడ్లు, డ్రైనేజీ, గడ్డి, గాధం, దోమలు, కోతులు, కుక్కల బెడదలతో ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటూ రోగాల పాలవుతున్నారని అన్నారు. వీధిలైట్లు కాలిపోయిన, దోమల మందు పిచికారి చేయాలన్న, మంచినీళ్ల మోటర్ కాలిన, పైపులైను పగిలిన డబ్బులు లేక పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి పెట్టవలసి వస్తుందని పెట్టలేని పరిస్థితి ఉన్న కాడ అభివృద్ధి కుంటిపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనాజిపురం గ్రామంలో పాటి మీద ఇళ్ళ మధ్యలో ఉన్న కాలువ మురికి దుర్గంధం కొడుతూ తరచూ ప్రజలు చిన్నపిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారని తక్షణం అవసరం లేని కాలువను పూడ్చాలని అన్నారు. ఇంకా గ్రామంలో అక్కడక్కడ పెండింగ్ లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనెజ్ ని పూర్తి చేయాలని, అనేకమంది నిరుపేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు లేక ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కుటుంబాలు కాపురాలు చేస్తున్నారని ప్రభుత్వము ఇల్లు లేని పేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అర్హత కలిగిన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇంకా అర్హత ఉండి పెన్షన్స్ రాని వారందరికీ అన్ని రకాల పెన్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వము తక్షణము గ్రామ సభ పెట్టి తగిన నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదూనూరి మల్లేష్, మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, గ్రామ కమిటీ కార్యదర్శి అబ్దుల్లాపూరం వెంకటేష్ , సిపిఎం నాయకులు ప్రజలు యండి. జహంగీర్, కడారీ క్రిష్ణ , ముచ్పపతి బాలయ్య , పిట్టల వెంకటేష్ , బొల్లెపల్లి పరమేష్ , మొగిలిపాక సుధాకర్, బొల్లెపల్లి క్రాంతి, సత్యనారాయణ, మావురం నర్సింహ, గౌరమ్మ , సతమ్మ, గోగు ఐలయ్య, యండి. షరీఫ్ లు పాల్గొన్నారు.