నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఉపాధ్యాయులకు ప్రస్తుతం అమలు చేస్తున్న పెన్షన్ పథకంపై ప్రభుత్వం పునరాలోచించి పాత పెన్షన్ పథకం తిరిగి అమలు చేయాలని ఆళ్ళపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఫయీమ్, తాళ్లపల్లి శేఖర్ సూచించారు. ఈ మేరకు మండల పరిధిలోని జాకారం గ్రామం ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రకృతి ప్రేమికుడు, ఫ్రూటేరియన్ షేక్ మహమూద్ పాషా చేపట్టిన 108 రోజుల ఫలాహార దీక్షకు స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో తనతో పాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని వినూత్న శైలిలో 108 రోజుల ఫలాహార దీక్ష చేయడం హర్షణీయమన్నారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు చూసుకునే నేటి సమాజంలో తనతో పాటు తోటి ఉద్యోగులకు సైతం ప్రయోజనం కలిగించే విషయంపై దీక్షకు పూనుకోవడం గర్వకారణం అన్నారు. ప్రభుత్వం పాత పెన్షన్ పథకం అమలు చేయాలి, ఎస్.జీ.టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని పాషా చేస్తున్న దీక్ష సఫలీకృతం అవ్వాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రెస్ క్లబ్ మిత్రులు దీక్షకు పూర్తి మద్దతు ఇచ్చినందుకు పాషా కృతజ్ఞతలు తెలిపారు. సంఘీభావం తెలిపిన వారిలో ప్రెస్ క్లబ్ సభ్యులు మొహమ్మద్ ఖలీల్ (ప్రజా ప్రతిభ), నరెడ్ల యోగేందర్ (వి6 వెలుగు) తాళ్లపల్లి కోటేశ్వరరావు (పీపుల్స్ డైరీ), తాళ్లపల్లి శ్రావణ్ (ఆంధ్రజ్యోతి), నరెడ్ల సతీష్ (భారత్ వార్త) ఉన్నారు.