
నవతెలంగాణ – కోహెడ
యాదవ కులస్తుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని యాదవ సంఘం మండల అధ్యక్షుడు పలుమారు సంతోష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ పార్టీవారైనా తమను ఓట్లు వేసే ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారని, కాంగ్రెస్ వెంట ఉంటే ఐనా రాజకీయంగా తమ సామాజిక వర్గానికి గుర్తింపు లభిస్తుందని ఆశపడితే ఇప్పుడు కూడా తమకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తంచేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేశామని తమను గుర్తించడంలో అలసత్వం జరుగుతుందని నిరాశ వ్యక్తం చేశారు. కోహెడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా ప్రకటించిన కమిటీలో ఒక్కటైన యదవులకు కేటాయించకుండా యదవులను చిన్న చూపు చూశారని ఆవేదన వ్యక్తంచేశారు. యదవులను కేవలం ఓటర్లుగా చూసే విధానాన్ని ఇప్పటికైనా స్వస్తి పలకాలని అన్నారు. ఈ ధోరణి ఇలానే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం తప్పదు అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బండ వెంకటస్వామి, ఉపాధ్యక్షులు ఆవుల మల్లేష్, కార్యదర్శి తాడిశెట్టి దయనంద్, కోశాధికారి మల్లేష్,కార్యవర్గ సభ్యులు లెంకల సంపత్, లింగం,మహేందర్, కాయిత నాగరాజు, రాజు,మని, తదితరులు పాల్గొన్నారు.