– రెండు నెలల్లో 15 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు
– మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలి
– ప్రతి కుటుంబానికి నెలకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించాలి
– సీఎం రేవంత్ కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రజాపాలన తెస్తామంటూ అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రజావ్యతిరేకిగా మారిపోయారని విమర్శలు గుప్పించారు. అనాలోచిత విధానాలతో, ఒక హామీ అమలుచేసే హడావుడిలో మరో వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న తీరు ఆయన పాలనా వైఫల్యాన్ని కళ్లకు కడుతోందని దుయ్య పట్టారు. నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోలకు గిరాకీ లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో 15 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. బతుకు బండి ఈడ్చలేక గురువారం బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తనకు ఇంతకాలం బువ్వపెట్టిన ఆటోను ఒక డ్రైవర్ తగులబెట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న 6.50 లక్షల మంది ఆటోడ్రైవర్లకు ప్రతినెలా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడంతో పాటు మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుంటే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.