– ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ని కలిసి వినతి
నవతెలంగాణ – కరీంనగర్ : ఎస్సీ, ఎస్టీ ,మైనారిటీ ,బీసీల అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది ఖాజా అహ్మద్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఇంచార్జ్ వలి ఉల్లాసమీర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనారిటీ విభాగం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ని గురువారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి విస్తృత చర్చ జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే SC, ST, OBC మరియు మైనారిటీల కోసం అమలు చేస్తున్న పథకాలను మరింత విస్తృతం చేయాలని సభ్యులు సూచించారనీ పేర్కొన్నారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్త కార్యక్రమాలను రూపొందించి, వెనుకబడిన వర్గాల ప్రజలను అన్ని రంగాల్లో ముందుండేలా ప్రణాళికల రూపొందించాలని వారు కోరినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ అస్లాం షరీఫ్, ఖాజా అర్హన్ అహ్మద్, అజంపురా మాజీ కార్పొరేటర్ ముజాఫర్ అలీ ఖాన్ పాల్గొన్నారు.