రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక వికలాంగ ప్రయోజనాల మంజూరుకు కఠినతర చట్టాలు చేసింది. సైనిక దళాల న్యాయసభ ఆదేశాలను ఉన్నత న్యాయస్థానాల్లో సవాలు చేస్తోంది.విశ్రాంత సైనికులు ఆగ్రహ నిరసనలతో ప్రభుత్వం నుండి ఊరట కోరుతున్నారు.సైన్యంలో విపత్తులు, వికలాంగతలు, మరణాలు ఎక్కువ.ప్రాణలొడ్డి పోరాడే సైనికులకు పరిహార చెల్లింపులకు గత ప్రభుత్వం ఉదార పద్ధతులను పాటించేది. సైనిక సేవల్లో, యుద్ధంలో గాయపడిన వారికి, జబ్బుపడినవారికి, వికలాంగుల యిన వారికి అధిక పింఛన్ ఈ విధానాల్లో ఒకటి. సైనిక వైద్యబృందం ధృవీకరించే వికలాంగత స్థాయిని బట్టి సైనికుల వికలాంగ ప్రయోజనాలను నిర్ణయిస్తారు. ఈ నిర్ణయం సరిగాలేన పుడు సైనికులు సైనిక దళాల న్యాయసభలో పరిహారం కోరవచ్చు. న్యాయసభ సైనికుల కష్టనష్టాలను లెక్కిస్తుంది. వికలాంగ సైనికులకు న్యాయసభ ఇచ్చిన తీర్పులను సవాలు చేస్తూ రక్షణశాఖచట్ట యుద్ధం పెంచింది. వివిధ న్యాయస్థానాల్లో పదహారు వేల కేసులు అపరిష్కృ తంగా ఉన్నాయి. హైకోర్టులు, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కమిషన్లు రక్షణశాఖ పద్ధతిని విమర్శించాయి. ఈ ధోరణి మానమని ఆదేశించాయి. అయినా రక్షణశాఖ వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. వికలాంగతలు నకిలీవని ఆ శాఖ వాదిస్తోంది. ‘సరిహద్దుల్లో మీరు లేకుంటే దేశంలో మేము బతకలేమని’ మోడీ పొగిడే సైనికులను, సైనిక వైద్య నిపుణులను రక్షణశాఖ అవమానిస్తోంది.
21సెప్టెంబర్2023 నుండి పదవి విరమణ చెందే సైనికుల వికలాంగ ప్రయోజనాలను రక్షణశాఖ సవరించింది. వికలాంగుల ప్రయోజనాలను కాపాడటానికి, ఉదార నిబంధనల దోపిడీని ఆపడానికి ఈ సవరణలు చేశామని త్రివిధ దళాధికారి జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ఈ సవరణలతో కిందిస్థాయి సైనికులు నష్టపోతున్నారు.సైనిక దళాల న్యాయసభ తీర్పులను సైన్యాధికారులు తిప్పికొడుతున్నారు. వికలాంగతలను సైనిక సేవలకు ఆపాదించలేమని, సేవల్లో అవి పెరగలేదని ప్రకటిస్తున్నారు. వికలాంగతను ఆమోదిస్తూనే దానికి సైనిక సేవలు కారణం కాదని బుకాయిస్తున్నారు. ఇటీవల ఒక అభ్యర్థనను తిరస్కరిస్తూ, గతేడాది 350 అభ్యర్థనలను తోసిపుచ్చామని, ఈ వ్యాజ్యాలు కొనసాగితే రక్షణశాఖకు జరిమానా విధిస్తామని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఇది ప్రజాప్రతినిధుల, న్యాయస్థానాల సమయ వ్యర్థ ప్రక్రియని వ్యాఖ్యానించింది. సైనిక సేవల్లో తగిలిన గాయాలతో పెనుగులాడుతున్న వృద ్ధసైనికుల నైతికతను ఈ అన్యాయాలు అవమానిస్తున్నాయి. ”ఇది కేవలం పింఛన్ సమస్య కాదు. సైనికమర్యాద, స్వీయ గౌరవాలకు భంగం కలిగించే విషయం.” అని ఏండ్ల తరబడి పింఛన్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న సేనాని అన్నారు. భ్రమలు తొలిగాయని వరిష్ట సైన్యాధికారులు బాధపడ్డారు. ”ఈ ధోరణి కలవరపరిచేది. దీన్ని వెంటనే సరిదిద్దాలి.” అని పూర్వ ముఖ్య సైన్యాధికారి వేదమాలిక్ అన్నారు.
”సైనికుల వికలాంగ ప్రయోజనాలను కోర్టుల్లో సవాలు చేయడం రాజ్యానికి, సైనికులకు మధ్యనున్న బంధాన్ని బలహీనపరుస్తుంది. చిక్కులను తెస్తుంది. తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.” అని ఉత్తర భారత పూర్వసైనిక ప్రధానాధికారి లెఫ్టినెంట్ జనరల్ డి.ఎస్. హుడా హెచ్చరించారు. సైనిక న్యాయసభ పరిష్కరించిన సైనిక వికలాంగ పింఛన్లను రక్షణశాఖ కోర్టుల్లో సవాలు చేయడాన్ని పరిశీలిస్తున్నానని ప్రభుత్వ ప్రధాన న్యాయవాది ఆర్. వెంకటరమణి నవంబర్‌లో అన్నారు.ఈ గొడవ 2010లో మొదలయింది. ఈ వ్యాజ్యాలను తగ్గించమని అనుభవజ్ఞులు, పౌరసంఘాలు 2014లో బీజేపీ ప్రభుత్వాన్ని కోరాయి. వికలాంగ సైనికులకు సైనిక న్యాయసభ ఇచ్చిన తీర్పులను సవాలు చేస్తూ రక్షశాఖ దాఖలు చేసిన 900 అభ్యర్థనలను 2014 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు తిప్పికొట్టింది.
2015 జులైలో రక్షణమంత్రి మనోహర్ పరికర్ ఈ వ్యాజ్యాలను తగ్గించడానికి కమిటీని వేశారు. ఇది రక్షణశాఖ అహంకార వ్యాజ్యా లను విమర్శించింది. సైనికులు అధిక శారీరక, మానసిక శ్రమలతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. తరచూ బదిలీలకు గురవుతారు. 24 గంటల మానసిక విధి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం సైనికుల్లో మానసిక అనారోగ్యాలకు కారణం. వీటితో వికలాంగతలు పెరుగుతాయి. సైనికుల సమస్యలను రక్షణశాఖ సున్నితంగా పరిష్కరించాలి. ఏప్రిల్ 2018 లో సుప్రీంకోర్టు ఈ విషయంపై రక్షణశాఖను మందలించింది. తన నకారాత్మక ధోరణి కోర్టుల భారాన్ని పెంచిందని, ప్రభుత్వసొమ్ము వృధా చేసిందని విమర్శించింది. రక్షణశాఖకు రూ.లక్ష శిక్షవేసింది. 2018 సెప్టెంబర్‌లో రక్షణమంత్రి నిర్మల సీతారామన్ ప్రతిష్ట వ్యాజ్యాలను ఆపాలని రక్షణశాఖకు సలహా ఇచ్చారు. ఇన్ని జరిగినా సైనిక న్యాయసభ తీర్పులను రక్షణశాఖ అమలుచేయలేదు. దీంతో కోపగించిన న్యాయసభ వరుస ఆదేశాలను జారీచేసింది. వాటిలో రక్షణరంగ ఆర్థిక విభాగ అధికారుల అరెస్టులూ ఉన్నాయి. ఫలితంగా రక్షణరంగ ఆర్థిక విభాగం ఈ అంశాన్ని మాజీసైనికుల సంక్షేమ శాఖ దృష్టికి తెచ్చింది. సైనిక విభాగ న్యాయమూర్తుల, న్యాయాధికారుల అభిప్రాయాన్ని కోరింది. అక్టోబర్ 2023లో రక్షణశాఖ పూర్వ రక్షణమంత్రుల నిర్ణయాలను చెత్తబుట్టలో వేసింది. సైనిక న్యాయసభ ఇచ్చిన సైనికుల అనుకూల తీర్పులపై కోర్టుల్లో వ్యాజ్యాలు వేయమని సైన్యాధికారులను ఆదేశించింది. 2023 కొత్త చట్టాలు జీవనశైలితో వచ్చే రక్త, గుండెపోట్లు, హృదయ రోగాలు, మధుమేహం వగైరా జబ్బులను వికలాంగ పింఛన్ పరిధి నుండి తొలగించాయి. ఈ తొలగింపు వికలాంగ పింఛన్ల వార్షిక ఖర్చును రూ.10 వేల కోట్ల నుండి రూ.6 వేలకోట్లకు తగ్గిస్తుందని రక్షణశాఖ అంచనా. దేశ సరిహద్దుల్లో శీతోష్ణస్థితులు విపరీత స్థాయిల్లో ఉంటాయి. సైన్యం పనిచేసే అత్యంత ఎత్తయిన ప్రదేశాలు వికలాంగతలకు దారితీస్తాయి. జీవనశైలి జబ్బులను వికలాంగత పరిధినుండి తొలగించడం విరోధాభాసం, అశాస్త్రీయం.
న్యాయసభ తీర్పులను రక్షణశాఖ చెల్లింపుల శాఖ సమీక్షిస్తుంది. అపసవ్యమనుకున్న కేసులను సైనిక న్యాయశాఖకు పంపుతుంది. న్యాయశాఖ న్యాయ మంత్రిత్వశాఖ అభిప్రాయాన్ని కోరుతుంది. అప్పుడు న్యాయసభ నిర్ణయాలను కోర్టులో సవాలుచేస్తారు. ఈ అంశంపై ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది. 2023లోని వికలాంగ పింఛన్లలో 36-40 శాతం అధికారులు, సైనిక వైద్యాధికారులు, 15-18 శాతం జవాన్లు తీసుకున్నారని ఈ నిఘా తెలిపింది. న్యాసభ నిర్ణయాలు పింఛన్ క్రమబద్ధీకరణకు వ్యతిరేకమని, వికలాంగ పింఛన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధీనంలో ఉందని, సైనిక మెడికల్ బోర్డులు తప్పుడు నివేదికలు ఇస్తున్నాయని రక్షణశాఖ అభియోగించింది. రక్షణశాఖ మాజీ సైనికుల సంక్షేమ విభాగం 11నవంబర్ 2024న ప్రభుత్వ ప్రధాన న్యాయవాదితో సమావేశమ యింది. సైనిక త్రివిధ దళాధిపతుల సమాచారంతో న్యాయసభ తీర్పులను, పింఛన్ విధానాలను సమీక్షిస్తోంది. సైనిక వికలాంగ పింఛన్లను ఇన్ని విభాగాలు వ్యతిరేకించడం శోచనీయం.
విమర్శించకుండా విధులు నిర్వహిస్తూ, దేశ రక్షణకు ప్రాణాలొడ్డే జవాన్లకు మద్దతుగా నిలవ వలసిన బాధ్యత రాజ్యానిది. రాజ్యమే విధులను విస్మరిస్తే సైనికులు ధైర్యం, నైతిక స్థైర్యం కోల్పోతారు. ప్రభుత్వం న్యాయసభల, న్యాయాస్థానాల తీర్పులను గౌరవించాలి. సైన్యాన్ని ప్రతిష్టగా పరిగణించాలి. ఆదర్శ యజమానిగా మారాలి.రాజ్యానికి, సైనికులకు మధ్య సంఘర్షణ దేశ ప్రతిష్టకు, భద్రతకు అపాయకరం. గౌరవ మర్యాదల కోసం న్యాయ పోరాటం చేయవలసిన స్థితికి మాజీ సైనికులను నెట్టడం అవమానకరం.
(ఇండియాటుడే సమాచారం ఆధారంగా)
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545