– కమ్మర్ పల్లి లో విస్తృతంగా వాహనాల తనిఖీలు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
రోడ్డు ప్రమాదాలను 50 శాతానికి తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్మూర్ హోటల్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మండల కేంద్రంలోని ఉప్లూర్ వెళ్లే దారిలో ఉన్న వరద కాలువ వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎంవిఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ జనవరి 1 నుండి 31 వరకు దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి అన్నారు. అందులో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలతో పాటు అధికారులతో బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాల తనిఖీలను చేపడుతున్నట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు వాహన పత్రాలతో పాటు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించడంతోపాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉండాలన్నారు. వాహనదారులు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. ఇతరులకు హాని కలిగే విధంగా అతివేగంతో వాహనాలు నడపొద్దని సూచించారు. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లు బ్యాచ్ నెంబర్ కలిగి ఉండాలని, యూనిఫామ్ ధరించాలని, అనుమతికి మించి ఎక్కువ ప్రయాణికులను ఎక్కించుకోవద్దన్నారు. ప్రయాణికులతో కూడా మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. వాహనాల తనిఖీ సందర్భంగా సరైన పత్రాలు లేని ఐదు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రోహిత్ రెడ్డి, కే.సాగర్, ఎన్.శ్రీనివాస్, డి.పవన్ కళ్యాణ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.