కనీస వేతనాల అమలులో పాలకులు విఫలం

Governments fail to implement minimum wages– ఎఐఆర్‌టిఎఫ్‌ రాష్ట్ర వర్క్‌షాప్‌ ముగింపులో ఎంఎ.గఫూర్‌
కర్నూలు : ట్రాన్స్‌పోర్టు రంగంలో కనీస వేతనాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎ.గఫూర్‌ అన్నారు. కర్నూలులోని పాతబస్తీ శ్రీలక్ష్మి నరసింహస్వామీ కళ్యాణ మండపంలో ఆల్‌ ఇండియా రోడ్‌ట్రాన్స్‌ పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌టిఎఫ్‌) ఆధ్వర్యంలో ఈ నెల16, 17 తేదీల్లో రాష్ట్ర వర్క్‌షాప్‌ ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు రాష్ట్ర అధ్యక్షులు శివాజీ అధ్యక్షతన జరిగింది. రెండవ రోజు ఆదివారం వర్క్‌షాప్‌ ముగింపులో ఎంఎ.గఫూర్‌, ఎఐఆర్‌టిఎఫ్‌ కార్యదర్శి ముజఫర్‌ అహమ్మద్‌, కోశాధికారి శ్రీనివాసులు, కమిటీ ముఖ్య నాయకులు దుర్గారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ ట్రాన్స్‌పోర్ట్‌ రంగం అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగమని అన్నారు. అలాంటి రంగంలో కనీస వేతనాలు అమలు కావడంలేదని తెలిపారు. పని గంటలు సైతం పట్టించుకునే నాథుడే లేరన్నారు. ఆటో, ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్లకు, ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఆర్థిక సహకారం అందించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. రవాణా రంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పెట్రోల్‌, డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తేవాలని, ఈ చలానా విధానాన్ని రద్దు చేయాలని తదితర సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని కోరారు. ఈ వర్క్‌షాప్‌నకు ఆయా జిల్లాల నుంచి రవాణా రంగ ప్రతినిధులు హాజరయ్యారు.