
కోటి ఆశలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి మద్యం టెండర్లపై ఉన్న ఆత్రుత అర్హులైన పేదలకు ఇళ్ళు ఇచ్చే ఆలోచనలో లేదని సీపీఐ (ఎం-ఎల్) రామచంద్రన్ పార్టీ ఉత్తర తెలంగాణ కార్యదర్శి ఎస్ సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉచిత పథకాల పేరుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా కొత్త హామీలను ఇస్తుందని అన్నారు.గడిచిన తొమ్మిదేండ్ల సమయంలో అర్హులైన పేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు పంపిణీ చేయలేదో, దళితులకు మూడెకరాల భూమి, దళిత, బీసీ బంద్ ఎంతమందికి అందించిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్టర్ల కోసం పెద్ద పెద్ద భవనాలు నిర్మించి, రోడ్లు వెడల్పు చేయడం ఒక్కటే అభివృద్ధి కాదని,అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి కనీస అవసరాలైన తిండి,బట్ట,ఉండడానికి ఇండ్లు అందుబాటులో ఉండాలని అన్నారు. గృహలక్ష్మీ పేరుతో ప్రజలకు 3 లక్షల రూపాయలు ఇస్తానన్న ప్రభుత్వం 3లక్షల రూపాయలతో ఎలా ఇల్లు నిర్మాణం జరుగుతుందో చెప్పాలని, పెరిగిన ధరలను అంచనా వేయకుండా 3లక్షల తో చేతులు దులుపుకోవలని చూస్తుందని ఎద్దేవాచేశారు. పొట్ట కూటికోసం గ్రామాలను వదిలి సంవత్సరాల తరబడి ఇంటి అద్దె చెల్లిస్తూ దుర్భర జీవనం గడుపుతున్న ఆటో, భవన నిర్మాణ కార్మికుల తో పాటు,అడ్డ కూలీలు, సాధారణ ప్రజలకు ఇంటి స్థలాలు ఇచ్చి పక్క ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు.అర్హులైన వారికి ఫించన్లు, కొత్తరేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.పట్టణంలో విస్తృతంగా ప్రబలుతున్న విష జ్వరాల నియంత్రణకై ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని,వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని, అనారోగ్యం కారణంగా ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అన్నారు.