– జీడీపీ మరింత తగ్గొచ్చు
– చైనా వేగంగా ఎదుగుతోంది
– మీడియాతో సీఈఏ అనంత నాగేశ్వరన్
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతమైన ఆర్థికవృద్ధి కోసం చర్యలు చేపట్టాలని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ అన్నారు. చిన్న, మధ్య తరగతి సంస్థలను వ్యయ నియంత్రణలతో పోటీ పడేలా చేయాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలపై నియంత్రణలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక సర్వే-2025 విడుదల అనంతరం నాగేశ్వరన్ మీడియాతో మాట్లాడారు. వ్యాపార రంగంలోని సంస్థలపై రాష్ట్రాలు అధిక కరెంటు చార్జీలను మోపుతున్నాయన్నారు. ఈ క్రమంలో వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలతో మనం పోటీ పడే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణలు చాలా కీలకమన్నారు. మార్పులో గ్లోబలైజేషన్ కీలక శక్తిగా మారుతోందన్నారు. ప్రపంచంలో చైనా అత్యంత వేగంగా ఎదుగుతోందని ఆయన తెలిపారు. కేవలం పదేండ్ల కాలంలోనే ప్రపంచంలోనే 70శాతం సౌరశక్తి ఆధారిత విద్యుత్తు తయారీ కేంద్రంగా మారిందన్నారు. ”వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి ఉంది. భవిష్యత్తు రంగం ఇదే. రైతులు పూర్తి స్థాయిలో ఉత్పత్తులు సాధించేలా బలోపేతం చేయాలి. ఈ రంగంలో బలమైన వృద్ధి సాధించగలిగితే.. జీడీపీ వద్ధిరేటులో 0.75శాతం నుంచి 1శాతం వరకు ఉంటుంది. దేశంలో గత పదేండ్లకుపైగా మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించడం సానుకూల ఫలితాలను ఇచ్చింది. తప్పుడు వాణిజ్య ప్రకటనలు, సెలెబ్రిటీల ఎండార్స్‌మెంట్లు, అస్పష్టమైన లేబులింగ్‌లు ఆందోళనకరం. ముఖ్యంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఈ విధానాల్లో అమ్మడం వినియోగ దారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ముప్పు ఉంది. క్యాన్సర్లు, శ్వాస సంబంధ సమస్యలు, గుండె జబ్బులు, జీర్ణకోశ సమస్యల ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం (హెచ్1)లో 6 శాతం వృద్ధి చోటు చేసుకుంది. ద్వితీయార్థంలో మరింత బలహీనపడిందని అంచనా వేస్తున్నాము.” అని నాగేశ్వరన్ పేర్కొన్నారు.