గవర్నర్ల ‘పరివార్‌’ మార్క్‌!

ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణం గా, రాష్ట్ర పెద్దగా గవర్నర్లు తమ పాత్ర పోషించాల్సింది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పరిపాలనను అనిశ్చితిలో పడేయడం, అడ్డు కోవడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వ హయాంలో వికృత పోకడలు పోవడం దారుణం. ఏటా మొదటి సెషన్‌లో శాసనసభనుద్దే శించి చేసే ప్రసంగం నుంచి, బిల్లులు తొక్కిపెట్టడం, వీధి పోరా టాల వరకూ అన్నింటా ఒకే తీరులో కాషాయ పార్టీ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారు. తాజాగా తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా ఉంది. తమిళ నాడు ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ పాఠాన్ని పూర్తిగా చదివేందుకు తిరస్కరించడంతోపాటు నాలుగు నిమిషాల్లోనే ముక్తసరిగా ముగించేశారు. రాజ్యాంగ నియమాలను, సభా మర్యాదలను మరోసారి ఆయన తుంగలో తొక్కారు. తమిళ భాషను ప్రశంసించే గీతాన్ని సభ ప్రారంభానికి ముందు, సమావేశాల ముగింపులో జాతీయగీతం ఆలపించడం తమిళనాడులో సంప్రదాయంగా వస్తోం ది. జాతీయ గీతం ఆలపించేవరకూ ఉండకుండా వెళ్లి పోయిన గవర్నర్‌ జాతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వడం లేదని ప్రత్యా రోపణ చేయడం సిగ్గుచేటు. తమిళనాడు తీవ్రమైన వరదల్లో చిక్కుకున్నా కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్రాలు రుణాలు చేయ కుండా, గ్రాంట్లు ఇవ్వకుండా, జిఎస్‌టిలో వాటా సక్రమంగా ఇవ్వకుండా కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గ వైఖరిపై కేరళ, కర్నాటక ప్రభుత్వాలు ఢిల్లీ నడిబొడ్డున నిరసన తెలిపాయి.
ఫెడరలిజాన్ని కాపాడడం కోసం కేరళ సీఎం విజయన్‌ నేతృత్వంలో నిర్వహించిన నిరసనలో ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు పాల్గొనగా, తమిళనాడు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గొం తు కలిపారు. ప్రతి వంద రూపాయల పన్నుల వాటాలో బీజేపీ పాలనలోని ఉత్తర ప్రదేశ్‌కు రూ.46 ఇస్తే, కేరళకు రూ.21 అందుతుందంటేనే ఈ వివక్ష అర్థమవుతుంది. 2022 జూన్‌లో నష్టపరిహార నిబంధనలను సైతం కేంద్రం రద్దు చేయడంతో తమిళనాడు ఏటా రూ.20వేల కోట్ల రెవిన్యూ లోటును ఎదు ర్కొంటోంది. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టులో సగం ఖర్చు భరిస్తా మని ఇచ్చిన హామీ నుండి కేంద్రం వెనక్కివెళ్లి, రెండేళ్లకుపైగా జాప్యం చేస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు ముప్పు వాటిల్లే సిఎఎను అమలు చేసే ప్రసక్తే లేదని తమిళనాడు సర్కారు ప్రతినబూనింది. జాతీయ జనగణనతోపాటు కుల గణన చేపట్టాలని కోరింది. ఈ అంశాలను చదివేందుకు గవర్నర్‌ కు మనస్కరించలేదు. 48 పేజీల ఈ ప్రసం గంలోని కొన్ని పేరాలతో తాను ఏకీభవించ లేనని, వాస్తవిక, నైతిక ప్రాతిపదికన వాటితో విభేదిస్తున్నానని సెలవిచ్చిన ఆయన ఆ అంశాలేమిటో మాత్రం చెప్పలేదు. గతేడాది బడ్జెట్‌ సమావేశాల ప్రారంభంలోనూ కొన్ని పేరాలను వదిలేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు, ద్రవిడ తరహా పాలన, పెరియార్‌ తదితర ద్రవిడ నేతల గురిం చి, అంబేద్కర్‌ గురించి ఉన్న భాగాలను విడిచిపెట్టారు.
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించుకుంటేనే గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతున్న తీరు అర్థమవుతుంది. బీజేపీయేతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దాడులు చేస్తూ, అక్కడి ప్రభుత్వాలను అస్థిరపరిచేం దుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జార్ఖండ్‌ సిఎం హేమంత్‌ సొరేన్‌ను అరెస్టు చేయగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సమన్లు పంపుతోంది. శాసనసభ ఆమోదించిన బిల్లులు, చట్టాలపై సంత కాలు చేయకపోవడానికి కారణాలుంటే వాటిని నోట్‌చేసి వెనక్కి పంపాలని, మళ్లీ అసెంబ్లీలో ఆమోదించి పంపితే ఆమోదించి తీరాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా, తమిళనాడు, పంజాబ్‌, కేరళ గవర్నర్లకు పట్టింపులేదు. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధిని, సం క్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు. పాలనా పరమైన సంక్షో భాన్ని సృష్టించేలా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగం ప్రవచించిన ఫెడరల్‌ స్ఫూర్తిని మంటగలుపుతున్న ‘పరివార్‌’ మార్క్‌ గవర్నర్ల చర్యలను దేశమంతా ఛీత్కరిస్తున్నా మోడీ సర్కారు వారిని అక్కున చేర్చుకోవడం సిగ్గుచేటు. కనుక ఆ సర్కారును గద్దె దింపితేనే ఇలాంటి నిరంకుశ పోకడలకు ఫుల్‌స్టాప్‌.
-ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌