రెండు నిమిషాలకే ముగిసిన గవర్నర్‌ ప్రసంగం

తిరువనంతపురం: కేరళ శాసనసభను ఉద్దేశించి గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ గురువారం చేసిన ప్రసంగం కేవలం రెండు నిమిషాలకే ముగిసింది. ప్రసంగ పాఠంలో చివరి పేరాను మాత్రమే చదివి ఆయన సభ నుండి నిష్క్రమించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వంతో గవర్నర్‌ తరచూ కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాల మొదటి రోజున సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించడం ఆనవాయితీ. ఆయన ఉదయం తొమ్మిది గంటలకు సభలో ప్రవేశించగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, స్పీకర్‌ ఏఎన్‌ షంశీర్‌ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అయితే గవర్నర్‌ ఖాన్‌ ముఖ్యమంత్రితో కనీసం కరచాలనం చేయలేదు. పుష్పగుచ్ఛాన్ని సైతం స్వీకరించలేదు.
సభలో జాతీయ గీతాన్ని ఆలపించిన తర్వాత గవర్నర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పదిహేనవ శాసనసభ పదవ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నానని చెబుతూ 61 పేజీల ప్రసంగ పాఠాన్ని చకచకా తిప్పేసి, చివరి పేరా మాత్రం చదివి ముగించారు.
తిరిగి జాతీయ గీతాలాపన జరిగిన తర్వాత 9.04 గంటలకు సభ నుండి వెళ్లిపోయారు. అంటే ఆయన సభలో ఉన్నది కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే. రాష్ట్ర చరిత్రలో గవర్నర్‌ ప్రసంగం ఇలా పూర్తికావడం ఇదే మొదటిసారి. కాగా గవర్నర్‌ చర్య శాసనసభను అవమానించడమే అవుతుందని ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్‌ చెప్పారు. ఆయన ఈ చర్య ద్వారా శాసనసభ పద్ధతులను, రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను ఉల్లంఘించారని విమర్శించారు. గవర్నర్‌ చర్యపై ముఖ్యమంత్రి విజయన్‌ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ మాట్లాడుతూ గవర్నర్‌కు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉండి ఉండవచ్చునని, అదే వాస్తవమైతే ఆయన అలా వ్యవహరించవచ్చునని చెప్పారు