– బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజాతీర్పును అవమానించేలా గవర్నర్ ప్రసంగం ఉందని బీఆర్‌ఎస్ సభ్యులు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం శాసనమండలి ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలోని కొన్ని పదాలను తొలగించాలని సవరణలను ప్రతిపాదించానని చెప్పారు. మొదటిరోజు కావడంతో ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సవరణలను ఉపసంహరించుకున్నట్టు వివరించారు. బీఆర్‌ఎస్ పార్టీకి మండలిలో మెజార్టీ ఉన్న నేపథ్యంలో తమ సవరణలు ఆమోదం పొందే అవకాశమున్నా ప్రభుత్వానికి సహకరించాలన్న ఆలోచనతో ఉసంహరించుకున్నట్టు చెప్పారు. ఇదే స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు. గడిచిపోయిన కాలం గురించి కాకుండా భవిష్యత్తులోనూ చేపట్టబోయే పనులు, తెలంగాణ ప్రగతి గురించి రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని కోరారు. ప్రజలకు నష్టం చేసే నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా పోరాడతామని హెచ్చరించారు. గవర్నర్ ప్రసంగాన్ని చూసి చాలా మంది బాధపడ్డారని అన్నారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను నిరంకుశ, నియంతృత్వ ప్రభుత్వాలుగా ప్రసంగంలో దూషించే ప్రయత్నం జరిగిందన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని చెప్పారు.
నిర్బంధాలకు కేరాఫ్ కాంగ్రెస్ : దేశపతి శ్రీనివాస్
తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటేనే కాంగ్రెస్ నిర్బంధాలు, అణచివేత గుర్తుకొస్తుందని బీఆర్‌ఎస్ సభ్యుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. శాసనమండలిలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం తెలంగాణ బిడ్డలను అవహేళన చేసినట్టుగా ఉందని ఆపార్టీ సభ్యుడు తాత మధు చెప్పారు. బీఆర్‌ఎస్‌కే చెందిన మరో సభ్యుడు శంభీపూర్ రాజు మాట్లాడుతూ ఏడు రోజుల్లో ఏడు మోసాలు చేసిన తీరు హంతకులే సంతాప సభ పెట్టినట్టుగా కాంగ్రెస్ పాలన ఉందన్నారు. గవర్నర్‌తో పచ్చి అబద్ధాలు, అవాస్తవాలను మాట్లాడించారని బీఆర్‌ఎస్ సభ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు చెప్పారు. గోరటి వెంకన్న మాట్లాడుతూ సోనియాగాంధీ, కేసీఆర్ విశిష్ట వ్యక్తులని అన్నారు. బీజేపీ సభ్యుడు ఎవిఎన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించకుండా, మౌలిక వసతులు కల్పించకుండా పేదలకు నాణ్యమైన విద్య అందకుండా చేసిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని స్వతంత్ర సభ్యుడు కూర రఘోత్తంరెడ్డి అన్నారు.