జెన్కోలో ఏఈఈ ఉద్యోగం సాధించిన గోవింద్ పెట్ సిరిపురం శ్వేత

నవతెలంగాణ  – ఆర్మూర్ 
 మండలం  లో నీ గోవింద్ పెట్ గ్రామానికి చెందిన సిరిపురం శ్వేత విద్యుత్ శాఖలోని జెన్కోలో ఏఈఈగా ఉద్యోగం సాధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులమీదుగా నియామక పత్రాన్ని ఇటీవల అందుకున్నారు. గోవింద్ పెట్ గ్రామానికి చెందిన సిరిపురం సాయేందర్, నాగమణి దంపతుల కుమార్తె శ్వేత ఒకటవ తరగతి నుంచి మూడవ తరగతి వరకు గోవింద్ పెట్ లోని శ్రీవాణి విద్యానికేతన్ లో, 4 నుంచి 8వ తరగతి వరకు ఆర్మూర్ లోని సెంట్ ఆన్స్ స్కూల్, 9,10వ తరగతి ఆర్మూర్ లోని మోడల్ స్కూల్, ఇంటర్మీడియట్ (ఎంపీసీ) హైదరాబాద్ లోని శ్రీగాయత్రీలో విద్యనభ్యసించింది. ఎంసెట్ ఇంజనీరింగ్ లో 3,852 ర్యాంక్ సాధించి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో సీటు సాధించారు. 2019 నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుండగా క్యాంపస్ సెలక్షన్ లో ఎల్ అండ్ టి, మారుతి సుజుకి కంపెనీలో రూ. 10 లక్షల ప్యాకేజీకి ఎంపిక కాగా శ్వేత జయిన్ కాలేదు. 2024 జులై లో విద్యుత్ శాఖలోని జెన్కోలో ఏఈఈ ఉద్యోగానికి పరీక్ష రాసింది. ఉద్యోగ సాధనకు కృషి చేస్తూనే కష్టపడి చదివి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కళాశాలలో రోబోటిక్ అండ్ అటానమస్ కోర్స్ (పిఏఎస్) లో పీజీ సీటు సాధించింది. బెంగళూరులో పీజీ కోర్స్ చదువుతుండగానే విద్యుత్ శాఖలోని జెన్కోలో ఏఈఈగా ఉద్యోగం సాధించి సోమవారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతులమీదుగా నియామకపత్రాన్ని అందుకున్నారు. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ లోని పాల్వంచలో ఏఈఈగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేస్తుండగానే ఏఈఈగా ఉద్యోగం సాధించిన శ్వేతను తల్లిదండ్రులు సాయందర్ నాగమణిలు మిఠాయిలు తినిపించి హర్షం వ్యక్తం చేశారు. జెన్కోలో ఉద్యోగం సాధించిన శ్వేతను గ్రామస్తులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. ఐఏఎస్ సాధించడమే లక్ష్యం  సిరిపురం శ్వేత, జెన్కో ఏఈఈ, గోవింద్ పెట్ కష్టపడి చదివి జెన్కోలో ఏఈఈ ఉద్యోగం సాధించాను. ఈ ఉద్యోగంతో తాను ఆగేది లేదన్నారు. మరింత కష్టపడి చదివి సివిల్స్ లో ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యం అన్నారు. తల్లిదండ్రుల లక్ష్యాన్ని నెరవేర్చడానికి మరింత కష్టపడి చదివి సివిల్స్ గోల్ ను సాధిస్తానన్నారు.