నలుగురితో కలిసి నడువకపోతే లోకంలో ఏకాకి అవుతారు. ఒక్కోసారి ఇష్టమున్నా లేకున్నా జై అంటే జై అనాల్సిన పరిస్థితి ఉంటది. పుట్టుకతోనే ఎదురుతిరిగే తత్వం ఉన్నవాళ్లు వేరై పోయి చరిత్ర సష్టిస్తరు. వాళ్లు సామాన్యులు కాదు. అయితే ఎక్కువగా ‘నలుగురితో నారాయణ కులంతో గోవిందా’ అనేవాళ్లే ఉంటారు. వేరుంటే, వేరైతే కష్టాలు ఎందుకని కులం ఎట్లా కట్టుబాట్లు వేస్తే అట్లే కొనసాగుతారు. ఈ వ్యవహారంలోనే ఈ సామెత పుట్టింది.
అయితే ‘నలుగురిలో నవ్వుల పాలు’ కావద్దని మరొక హెచ్చరిక సామెత కూడా ఉంటుంది. కొంచెమన్నా సొంత మెదడుతో ఆలోచించాలనేది ఆ సామెత సారాంశం. ‘నలుగురు నవ్వినట్టే ఉంటది నా మాట కుదిరినట్టే ఉంటది’ అనే సామెత నలుగురిని మెప్పించే సామెత. నలుగురికి నాయకత్వం వహించే వారి పట్ల ఉపయోగించే సామెత. నలుగురిలో ఆయన మాటకు విలువ పెరిగింది అన్నమాట. నలుగురిలో కలిసి ఉంటూనే విడిగా ఆలోచించి నలుగురిని మెప్పించే వ్యక్తిత్వం అన్నమాట ఇది.
ఇంకో సామెత ఉంది. ‘నలుగురు నడిచిందే బాట నలుగురు మెచ్చిందే మాట’. ముందే చెప్పినట్టు ఇది నలుగురితో నారాయణ టైపు. నలుగురు నడిచింది అంటే బాట పడ్డట్టు. దాన్నే నలుగురు మెచ్చుతారు. ఈ నలుగురు ఎవరంటే ఊరు, వాడ, సంఘం, సమాజం. పౌరులు చేసే పనులు అందరికీ ఆమోదయోగ్యం కావాలని సష్టించిన సామెతలు. దీనికి మరొక సామెత ఉంది. ”నలుగురు వింటే నాలుగు లోకాలు విన్నట్టు’. విన్న నలుగురు మరి నలుగురికి చెప్పి, వాళ్లు మరికొందనిరి చెప్పి, అందరికీ విషయం విస్తత పరచడం యొక్క ఉద్దేశ్యమే ఈ సామెత.
– అన్నవరం దేవేందర్, 9440763479