గొర్రెల స్కాంపై సర్కారు దర్యాప్తు

– రూ.700 కోట్లకు పైగా చేతులు మారినట్టు ఏసీబీ అభియోగాలు
– రెండు విడుతల్లో ప్రభుత్వం రూ.5వేల కోట్లు వ్యయం
– 4లక్షల కుటుంబాలకు 80 లక్షల గొర్రెల పంపిణీ
– అయినా సంఖ్య పెరగక పోవడంపై సందేహాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గొర్రెల పంపిణీ పథకంలో భారీ అవినీతి జరిగింది. వేలు కాదు లక్షలు కాదు, రూ. 7వందల కోట్లకుపైగా మింగేశారు. ఈ స్కీంను పెద్ద స్కాంగా మార్చేశారు. రైతులకు బదులు ప్రయివేట్‌ వ్యక్తుల ఖాతాల్లోకి నిధులు మళ్లించారు. 2019 నుంచి జరిగిన ఈ కుంబకోణంలో పశుసంవర్థకశాఖలోని కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఉన్నారని పేర్కొంటూ ఏసీబీ కేసులు నమోదు చేసి పలువురిని ఇప్పటికే అరెస్ట్‌ చేసింది. ఈ అవినీతిపై లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందని సర్కార్‌ భావిస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని 2017 జూన్‌ 20న ప్రారంభించింది. రెండు విడుతల్లో రాష్ట్రంలో అర్హులుగా గుర్తించిన 7.30 లక్షల మందికి రెండేండ్లలో గొర్రెలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఒక్కో యూనిట్‌ కింద 21 గొర్రెలకు రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు. ఆ తర్వాత మునుగోడు ఎన్నికల సందర్భంలో ఈ మొత్తాన్ని రూ.1.75 లక్షలకు పెంచారు. రెండు విడుతల్లో కలిపి నాలుగు లక్షల యూనిట్లకు 21 గొర్రెల చొప్పున దాదాపు 84 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. అయితే రెండో విడుతలో అనేక అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో సర్కార్‌ ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ పథకంలో అవినీతికి పాల్పడి ప్రయివేట్‌ వ్యక్తులతో కలిసి బినామీ బ్యాంక్‌ ఖాతాల్లోకి పథకం నిధులను తరలించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.ఈ పథకం కింద పంపిణి చేసిన గొర్రెలెన్ని? ఎంత మొత్తాన్ని దీని కోసం వెచ్చించారు? పశు సంపద ఎంత మేర పెరిగింది? తదితర అంశాలపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విచారించింది. ఫలితంగా నమ్మశక్యం కాని నిజాలు బయటపడ్డట్టు తెలుస్తోంది. 2019 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,90,81,605 గొర్రెలు, 4,96,465 మేకలు ఉన్నాయి. రెండు విడుతల్లో గొర్రెల పంపిణీ తర్వాత 2024 జూన్‌ నాటికి 1,24,14,299 గొర్రెలు, 3,92,609 మేకలు మొత్తం కలిపి 1,62,69,908 ఉన్నట్టు తేలింది. 2019 నుంచి 2024 గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలు, మేకల సంఖ్య సగటున 32.40 శాతం తగ్గిందని వెల్లడైంది. రెండు విడుతల పంపిణీ తర్వాత ఎందుకు తగ్గింతో తేలాల్సి ఉంది.