– కొంగర రోహిత్ భౌతికకాయం అప్పగింత
– బాధను దిగమింగి.. వైద్య విద్యార్థుల కోసం భౌతికకాయం
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ్‌నగర్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు, పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు కొంగర శ్రీనివాస్‌రావు, నీరజ దంపతుల కుమారుడు కొంగర రోహిత్ (33) అనారోగ్యంతో ప్రగతి ఆస్పత్రి లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. దాంతో కొంగర రోహిత్ భౌతిక కాయాన్ని వారి తల్లిదండ్రులు బుధవారం ఉదయం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులకు పరిశోధన నిమిత్తం అందజేశారు. యుక్త వయసులోనే కొడుకు చనిపోయినా.. ఆ బాధను దిగమింగి, కొడుకు నేత్రాలను దానం చేయడమే కాకుండా, మొత్తం భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల ప్రయోగాల కోసం అప్పగించడం అత్యంత ఆదర్శవంతమైన విషయ మని పలువురు కొనియాడారు. సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, న్యూడెమోక్రసీ పార్టీల నాయకులే ఇప్పటివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 16 వరకు భౌతిక కాయాలు అందించారని మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ సుధాకర్‌రావు కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ ప్రక్రియ సమాజానికి ముఖ్యంగా వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. కొంగర రోహిత్ భౌతికకాయానికి సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, న్యూడెమోక్రసీ, సీపీఐ తదితర పార్టీల నాయకులు నివాళులర్పించారు. అలాగే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు వనమాల కృష్ణ, వి.ప్రభాకర్, ఆకుల పాపయ్య, కంజర భూమన్న, ఆల్గోట్ రవీందర్, దాసు, పి.శ్రీధర్, ఎం.సుధాకర్, రామ్మోహన్ రావు, నర్రా రామారావు, నర్సింలు, రామకృష్ణ నివాళులర్పించారు.