నగదు బదిలీపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి: జీఎంపీఎస్

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గొర్రెల పంపిణీ పథకానికి అవసరమైన నిధులు విడుదల చేసి డిడిలు చెల్లించిన లబ్దిదారులకు నగదు బదిలీ ద్వారా వెంటనే అమలు చేయాలని  గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి మద్ధెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో జిఎంపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ హన్మంతుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గొర్రెల పంపిణీ పథకం కొనసాగిస్తామని తమ మెనిఫెస్టోలో ప్రకటించి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అమలు చేయడంలేదని విమర్శించారు. జిల్లాలో సుమారుగా 13,700 మందికి రెండవ విడత గొర్రెలు రావల్సి ఉండగా 347 మంది తమ వంతు వాటాధనం రూ.43,750 రూపాయల చొప్పున జిల్లా కలెక్టర్ ఖాతాలో జమచేసి నెలలు తరబడిగా ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యకం చేశారు.ప్రభుత్వ జాప్యం వల్ల విసిగిపోయిన 150 మంది లబ్దిదారులు తమ డిడిలను వాపసు ఇవ్వాలని ధరఖాస్తు చేసుకున్నారనితెలిపారు. గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తామన్న ప్రభుత్వ హామీకి విరుద్ధంగా సంబంధింత అధికారులు డిడిలు వాపసు కొరకు ప్రత్యేక ధరఖాస్తును రూపొందించారని వివరించారు.అందుకనే ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీ మేరకు డిడిలు వాపసు ఇచ్చే ఆలోచన విరమించుకొని రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకానికి అవసరమైన నిధులు విడుదల చేసి నగదు బదిలీ ద్వారా అమలు చేస్తామని స్పష్టమైన హామీని ఇవ్వాలని,వృత్తి రీత్యా ప్రమాదాల్లో చనిపోయిన గొర్రెల మేకల పెంపకం దారులకు రూ.10 లక్షల ఎక్స్ రేషియో ఇవ్వాలని,ఉచిత గొర్రెల బీమా పథకం అమలు చేయాలని,50 సంవత్సరాలు దాటిన వారికి నెలకు రూ.5000 రూపాయల పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దయ్యాల నర్సింహ్మ, ఉపాధ్యక్షులు బుడమ శ్రీశైలం,సహాయ కార్యదర్శి ఎల్లంల సత్యనారాయణ,జిల్లా కమిటీ సభ్యులు జెట్ట చిరంజీవులు, ర్యాకల శ్రీనివాస్, పాక జహాంగీర్, తెల్జూరి మల్లేష్,మన్నెబోయిన రాజలింగం,యాదగిరి లు పాల్గొన్నారు.