గోయల్‌ రాజీనామా గుట్టు విప్పాలి

Goyal's resignation Untie the knot– కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలి : సీపీఐ (ఎం) డిమాండ్‌
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ ఆకస్మికంగా రాజీనామా చేయడంపై సీపీఐ (ఎం) ఆందోళన వ్యక్తం చేసింది. గోయల్‌ రాజీనామాకు దారితీసిన కారణాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. రాజ్యాంగబద్ధంగా స్వేచ్చగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ కీలక పాత్ర నిర్వహించాల్సి ఉంటుందని, ఆ సంస్థ విశ్వసనీయతలో రాజీ పడరాదని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో తెలిపారు. స్వేచ్ఛగా, నిస్షక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన త్రిసభ్య ఎన్నికల కమిషన్‌లో ఇప్పుడు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మాత్రమే మిగిలారు. అనూప్‌ పాండే గత నెలలోనే పదవీ విరమణ చేయగా, ఇప్పుడు తాజాగా గోయల్‌ రాజీనామా చేశారు. అనూప్‌ పదవీ విరమణతో ఖాళీ అయిన పోస్టును ఇప్పటికీ భర్తీ చేయలేదు. మరోవైపు ఎన్నికల తేదీలను మరి కొద్ది రోజుల్లో ప్రకటించబోతున్నారు.
ఈ నేపథ్యంలో సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘లోక్‌సభ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున కసరత్తు జరగాల్సి ఉంది. అయితే దీనికి ముందే ఎన్నికల కమిషన్‌లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఇది అనిశ్చిత వాతావరణాన్ని కల్పిస్తోంది. ఈ పరిస్థితికి దారితీసిన పరిణామాలపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది’ అని ఆ ప్రకటనలో పొలిట్‌బ్యూరో సూచించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంపై వచ్చిన నూతన చట్టం కారణంగా కమిషన్‌ కూర్పు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ కిందికి వచ్చిందని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితులలో ఎన్నికల కమిషన్‌ స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించగలదా అనే ఆందోళన రేకెత్తుతోందని తెలిపింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. సీఈసీ, ఈసీల నియామకంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం గత సంవత్సరం తీసుకొచ్చిన నూతన చట్టాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. నూతన చట్టం ప్రకారం నియామకాల కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తికి స్థానం లేకుండా చేశారు. ప్రధాని నేతృత్వంలోని నియామకాల కమిటీలో ఆయన నియమించే ఓ కేంద్ర మంత్రితో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత కానీ లేదా సభలో అతిపెద్ద పార్టీ నాయకుడు కానీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఎంపిక చేసిన పేర్లను ధృవీకరణ కోసం రాష్ట్రపతికి పంపుతారు. సీఈసీ, ఈసీల ఎంపిక కోసం ఏర్పాటు చేసే కమిటీలో ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత లేదా అతి పెద్ద పార్టీ నేత సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు గత సంవత్సరం మార్చిలో తీర్పు ఇచ్చిన విషయం తలెసిందే. అయితే కేంద్రం ఈ తీర్పును బేఖాతరు చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది.