జీపీ కార్మికులకు రూ.21వేల వేతనం ఇవ్వాలి

– అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
– రెండో రోజూ కొనసాగిన గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె
నవతెలంగాణ- విలేకరులు
గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేసి.. కనీస వేతనం రూ. 21వేలు ఇవ్వాని అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జీపీ కార్మికుల సమ్మె రాష్ట్రవ్యప్తంగా శుక్రవారం కూడా కొనసాగింది. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె కు జయలకిë మద్దతు తెలిపి మాట్లాడారు. జీవో 51 సవరించి మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. భువనగిరిలో పంచాయతీ కార్మికుల సమ్మెకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. సంస్థాన్‌ నారాయణపురంలో కార్మికులు వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఖమ్మం రూరల్‌లో జేఏసీ రాష్ట్ర చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌ దీక్షా శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రూరల్‌లో సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మణుగూరులో సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది.