– సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేష్
– దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కరించాలి
నవతెలంగాణ-నిర్మల్
గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలనీ, దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు, పాలకులు మారినా కార్మికులు సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి సీతక్కని ఐదు సార్లు కలిసి విన్నవించినా హామీ ఇస్తున్నారే తప్ప ఆచరణలో ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఎనిమిది నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉంటే కార్మికులు ఏమి తిని బతకాలని ప్రశ్నించారు. కార్మికుల జీవితాలకు భద్రత లేదని, మల్టిపర్పస్ విధానం వచ్చిన తర్వాత కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని అన్నారు. చేతులు, కాళ్ళు తెగిపోతున్నా, శరీరం అస్తవ్యస్తమైన పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. కార్మికులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఆదివారాలు, పండుగ సెలవులు అమలు కోసం, ఇతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ హామీ ఇచ్చారని, వెంటనే అమలు చేయాలని కోరారు. కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే రాబోయే బడ్జెట్ సమావేశాల్లో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్.నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్, పోశెట్టి, జిల్లా సహాయ కార్యదర్శి లింగన్న, వీలాస్, కార్మికులు పాల్గొన్నారు.