త్వరలో జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పట్టభద్రులు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్, ఆశ్వారావుపేట నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పి.రాంబాబు సూచించారు. 2020 నవంబర్, 1వ తేదీ నాటికి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పట్టభద్రులు ఓటు నమోదుకు అర్హులని ఆయన స్పష్టం చేశారు.గతంలో ఓటు హక్కు ఉన్న పట్టభద్రులు కూడా మళ్ళీ ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం ఆయన పట్టభద్రుల ఓటు నమోదు పై రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 6 తేదీ వరకు ఫాం – 18లో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. దరఖాస్తుకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, నివాసం, ఫోటో జత చేయాలని తెలిపారు.పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకునేలా పార్టీల నాయకులు దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వి. కృష్ణ ప్రసాద్, నయాబ్ తహశీల్దార్ సీ.హెచ్.బి రామకృష్ణ, వి. లావణ్య, ప్రభాకర్, రాజకీయ పార్టీల నాయకులు చిన్నం శెట్టి సత్యనారాయణ,కె.రామకృష్ణ, తగరం జగన్నాధం,చిప్పనపల్లి శ్రీనివాసరావు, గంధం ఆనంద్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.