నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రప్రభుత్వం ఆదేశించినట్టు వానాకాలం పంట వరిధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా నిర్ణయించినట్టు నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పట్టణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించబోతున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. గ్రేడ్‌ ఏ ..2320 (క్వింటాల్‌కు), సాధారణ ధర 2300, సన్న రకం వరి ధాన్యానికి అదనంగా 500 రూపాయలు బోనస్‌ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. దసరా పండుగ తర్వాత భువనగిరి, సూర్యాపేట జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
సీఎంఆర్‌కు సన్నధాన్యం..
ఈ ఏడా ది నుంచి సన్నధాన్యాన్ని కూడా సీఎంఆర్‌ (కస్టమ్‌మిల్లింగ్‌ రైస్‌) కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సీఎంఆర్‌పై ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం తాము బియ్యం ఇవ్వలేమని, సన్నధాన్యానికి నూతన విధానాన్ని ఏర్పాటుచేయాలని మిల్లర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు మిల్లర్లు ప్రభుత్వానికి ఇప్పటికే వినతిపత్రాలివ్వగా, దీనిపై పౌరసరఫరాలశాఖాధికారులు, వ్యవసాయాధికారులు, మిల్లర్లతో ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయం కోసం అధికారులు, మిల్లర్లు, రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సన్నధాన్యం సీఎంఆర్‌కు ఇస్తే క్వింటా ధాన్యానికి వానాకాలం లో అయితే పచ్చి బియ్యం 67కిలోలు, యాసంగిలో అయితే బాయిల్డ్‌రైస్‌ 68కిలోల చొప్పున ప్రభుత్వానికి అందజేయాలి. ఇది తమకు నష్టమని మిల్లర్లు చెబుతున్నారు. వానాకాలం సీజన్‌లో వచ్చే బియ్యాన్ని ప్రభుత్వరం గసంస్థలు 17శాతం తేమతో కొనుగోలు చేస్తాయని, ఆ బియ్యాన్ని మిల్లింగ్‌ చేస్తే 60శాతానికి లోపే పచ్చి బియ్యం వస్తుందని, దీని ప్రకారం 60శాతం బియ్యమే ఇచ్చేలా నిబంధన మార్చాలని మిల్లర్లు కోరుతున్నారు. బాయిల్డ్‌ రైస్‌లోనూ అదే తేడా వస్తోందని, ఆ మేరకు సడలించాలని కోరుతున్నారు. దొడ్డురకాల ధాన్యం మిల్లింగ్‌చేస్తే 64శాతానికి మించి బియ్యం రావడం లేదని, ఈ మేరకు సీఎంఆర్‌ 64శాతానికి కుదించాలని కోరుతున్నారు.