ధాన్యం..దయనీయం.?

– తడిసి ముద్దాయిన కొనుగోలు కేంద్రాలు
– కల్లాల్లో నిండుగా  ఉన్న ధాన్యం
– లారీల కొరత, రైస్ మిల్లుల అలర్ట్  లేదంటూ సాకులు
– వళ్లెంకుంట కొనుగోలు కేంద్రంలో   రైతులు ఆందోళన
నవతెలంగాణ – మల్హర్ రావు
గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు అతలాకుతలం అవుతున్నారు.ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందజేయాలనే ఉద్దేశ్యంతో మండలంలో పిఏసిఎస్,డిసిఎంఎస్ ఆధ్వర్యంలో 22 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.అయితే అకాల వర్షాలు రైతన్నకు వెంటాడటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయితే,మరికొన్ని కేంద్రాల్లో ధాన్యం మొలకెత్తిన పరిస్థితి.ఇందుకు తోడుగా కొందరూ  డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మ్యాచర్ వచ్చిన తూకం వేయడంలేదని,లారీల కొరత ఉందని,  రైస్ మిల్లులు అలర్ట్ లేదని  కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని పలువురు రైతులు వాపోతున్నారు.ఇందుకు సాక్షాత్తు నిదర్సనమే వళ్లెంకుంట డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రమే. మరోవైపు ప్రకృతి ప్రకోపంతో రెండు రోజులు ఎండలు, మరో రెండు రోజులు వర్షాలు కురియడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దాకాగా, కోతకు వచ్చిన వరి పొలాలు నెలవాలిపోతున్నాయని,.దీంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు వాపోతున్నారు.వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి  నోట్లోకొచ్చే సమయంలో వరుణ దేవుడి కరుణ లేకపోవడంతో అప్పుల పాలవడం ఖాయమని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కొనుగోళ్లు  కొంతే..
మండలంలో పిఏసిఎస్,డిసిఎంఎస్  కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ రబీ సీజన్లో సుమారుగా 18 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యం ఉండగా ఇప్పటికి 6 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి.అకాల వర్షాలతో ధాన్యం తడిసి మ్యాచర్ రాకపోవడంతోనే కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతున్నట్లుగా పిఏసిఎస్ సిబ్బంది, డిసిఎంఎస్  నిర్వాహకుల వాదన వినిపిస్తోంది.
సేకరణలో నిర్లక్ష్యం…వళ్లెంకుంటలో రైతులు ఆందోళన..
తమ ధాన్యం మ్యాచర్ వచ్చిన తూకం వేయడంలో కొనుగోలు కేంద్రము నిర్వాహకుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్టునట్లుగా మండలంలోని వళ్లెంకుంట గ్రామ రైతులు గురువారం డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రలో ఆందోళన,నిరసన కార్యక్రమాలు సుమారుగా గంటపాటు చేపట్టారు.తాము ధాన్యం అమ్ముకోవడానికి నాలుగు వరాల క్రితం కొనుగోలు కేంద్రంలో పోస్తే మ్యాచర్ రాలేదంటూ కొన్ని రోజులు, లారీల కొరత ఉందని, రైస్ మిల్లు అలర్ట్ రాలేదని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లుగా గ్రామ మాజీ సర్పంచ్ భద్రపు సమ్మయ్య,ఆనంద రావు,మంథని జయలక్ష్మి తోపాటు 50 మంది రైతులు ఆందోళన చేపట్టారు.తాము వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ధాన్యం పండిస్తే ఒకవైపు అకాల వర్షాలు భయాందోళనకు గురిచేస్తే, మరోవైపు కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు నిర్లక్ష్యంగా వ్య హరిస్తున్నట్లుగా రైతులు వాపోతున్నారు.
ధాన్యం పోసి 25 రోజులు అయింది: మంథని జయలక్ష్మి….మహిళ రైతు వళ్లెంకుంట…గ్రామం
ధాన్యం అమ్ముకోవడానికి వా ళ్లెంకుంట డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రంలో 25 రోజుల క్రితం నేటికి తూకం వేయలేదు.పోసిన మూడు రోజులకే తూకం వేస్తాని వేయకపోగా అకాల వర్షాలతో సేకరణ ఆలస్యంగా జరుగుతుంది.
లారీల కొరత, మిల్లు అలర్ట్ లేదంటూ….ఆలస్యం: ఆనంద రావు….రైతు….వళ్లెంకుంట గ్రామం.
వళ్లెంకుంట డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించడానికి పోస్తే లారీల కొరత, రైస్ మిల్లుల అలర్ట్ లేదంటూ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. అదే కొయ్యుర్  డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రంలో సేకరణ వేగంగా నడిపిస్తున్నాడు.ప్రభుత్వం, అధికారులు పట్టించుకోని కొనుగోళ్లలో వేగం పెంచుతూ,తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.
అధికారులు పర్యవేక్షణ చేయాలి: భద్రపు సమ్మయ్య…మాజీ సర్పంచ్ 
తడిసిన, రంగుమారిన,మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. లేదంటే రైతుల  పక్షాన పోరాటం తప్పదు.కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.