– రైతులు సన్న రకం వరి సాగు చేయాలి : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్.చౌహన్
నవతెలంగాణ – చిగురుమామిడి / చొప్పదండి
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్.చౌహాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కేంద్రంలో, చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. వరి ధాన్యం కుప్పల మ్యాచర్ శాతాన్ని పరిశీలించి, రైతులు పూర్తిగా ఎండిన తర్వాతే పంటను కోస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. సన్న వడ్లు పండించే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. సన్నాలను సాగు చేయడం ద్వారా రైతులు అధిక లబ్ది పొందుతారని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సమర్థవంతంగా నడుపుతున్న చిగురుమామిడి కొనుగోలు కేంద్రం కమిటీ సభ్యులను కమిషనర్ అభినందించి వారిని శాలువాలతో సత్కరించారు. ఆయన వెంట కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, జిల్లా సహకార అధికారి రామానుజాచార్యులు, డీఎస్‌ఓ నర్సింగరావు, డీఎం సివిల్ సప్లై రజనీకాంత్ తదితరులు ఉన్నారు.