– పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వెంటనే పూర్తి చేయాలి
– ప్రజలు వడ దెబ్బకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి
– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
అన్ని ప్రాంతాలలో యసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆమె హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం, తాగునీరు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలుకు గాను అవసరమైన చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, అవసరమైతే పెంచాలని సిఎస్ తెలిపారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు తో పాటు,మరో వైపు 2023-24 వానాకాలం సీఎంఆర్ లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. రిజర్వాయర్లు నిండుకోవడం, భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో పట్టణాలు, గ్రామాలు మారుమూల గిరిజన ప్రాంతాలలో ఎటువంటి తాగునీటి సమస్య రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. తాగునీటి ఎద్దడిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని, తాగు నీటి సమస్య పరిష్కారం కోసం వేసవి కార్యాచరణ ప్రణాళిక తయారుచేసుకుని మండల, గ్రామ వార్డు స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమించి తాగునీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చేయాలని సూచించారు. తాగునీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.మిషన్ భగీరథ నీటి తో పాటు, స్థానికంగా వనరులను ఉపయోగించుకొని తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. రాబోయే రెండు నెలలు ప్రత్యేకమైన ప్రణాళికతో ఎటువంటి తాగునీటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేయాలని, పాఠశాలల ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.ఈ పనుల కోసం మండల స్థాయిలో వర్క్ షాప్స్ నిర్వహించాలని, చిన్న చిన్న పనులు పూర్తి చేసిన తర్వాత పెద్ద పనులు చేపట్టాలని, జూన్ 10 వరకు ఈ పనులన్నీ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత వేసవి కంటే ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలోప్రజలను వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తం చేయాలని, వడదెబ్బ తగలకుండా అవగాహన కల్పించాలని, జిల్లా స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్స్ లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, ఆశ వర్కర్ల ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేయాలని చెప్పారు. ఏ సమయంలో బయటకు వెళ్లాలి. తప్పనిసరి బయటికి వెళ్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో పాటు, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ టి. పూర్ణచందర్, డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, డిపివో మురళి, డిఎస్ఓ వెంకటేశ్వర్లు,ఆర్డబ్ల్యూఎస్, విద్యాశాఖ,మెడికల్ అండ్ హెల్త్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.