– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సరైన తేమ శాతం, నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని వచ్చిన రోజే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రం నిర్వాహకులు, రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యంలో తేమ శాతాన్ని యంత్రం ద్వారా పరిశీలించారు. తేమ సరిగా వస్తున్నదా? తూకం సరిగా చేస్తున్నారా? అని నిర్వాహకులను మంత్రి అడిగారు. సరైన తేమ, నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి అదే రోజు మిల్లులకు పంపించాలని సూచించారు. ధాన్యం విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పారు. నిర్వాహకులు ధాన్యాన్ని ఎప్పటికప్పుడే కొనుగోలు చేయడం, రైతులకు వెంటనే చెల్లింపులు చేస్తుండటం పట్ల మంత్రులు అభినందించారు. వారి వెంట జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.