కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

– మార్కెటింగ్ డీపీఎం నళిని నారాయణ 
నవతెలంగాణ – పెద్దవంగర
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మార్కెటింగ్ డీపీఎం నళిని నారాయణ అన్నారు. బుధవారం మండలంలోని బంగారు చెలిమి తండా, బొమ్మకల్లు, వడ్డెకొత్తపల్లి, కొరిపల్లి, ఉప్పెరగూడెం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వడ్డెకొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. యాసంగిలో రైతుల సౌలభ్యం కోసం ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని మౌలిక వసతులను నిర్వాహకులు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీరు, సరైన నీడ, వసతి తో పాటు ఆశ, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లను సైతం అందించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గరిష్ట మద్దతు ధర లభిస్తుందన్నారు. ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం విక్రయిచి నష్టపోవద్దన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి, మట్టి, తాలు లేకుండా కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ యశస్విని, సీసీలు జీ. సుధాకర్, బీ. సుధాకర్, పద్మ, ఆపరేటర్ అనిల్, ట్యాబ్ ఆపరేటర్ నిర్మల, వీవో అధ్యక్షురాలు స్వాతి, మంజుల, సంధ్య తదితరులు పాల్గొన్నారు.