గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న డిమాండ్ చేశారు. శనివారం గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుండి ర్యాలీగా తరలివచ్చరు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మల్లిపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ… గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆరు నెలల నుంచి వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జీవో నంబర్ 51ని సవరించాలని, మల్లీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి కేటగిరి వారీగా వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అధికారంలో లేని సమయంలో సీతక్క గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు గ్రామాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్న కూడా సమస్యల గురించి మాట్లాడడం లేదన్నారు. మంత్రి స్పందించి పెండింగ్ వేతనాలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కిరణ్, విలాస్, అరవింద్, రపీ, శంకర్, రాజు, ఇంద్రజ్, లస్మన్న పాల్గొన్నారు.