నవతెలంగాణ -తాడ్వాయి
గ్రామాలలోని గ్రామపంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వం భేషరతుగా పర్మినెంట్ చేయాలని గ్రామపంచాయతీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట గౌడ్ డిమాండ్ చేశారు. తాడువాయి మండల కేంద్రంలో బుధవారం గ్రామపంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్న అర్థనగ్న ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికులు రోజుకు 10 గంటల పాటు వెట్టి చాకిరి పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీ కార్మికునికి నెలకు రూ.19 వేలు వేతనం చెల్లించాలని కోరారు గ్రామపంచాయతీ కార్మికులు మృతిచెందితే వారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగబోదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులు శివానందం గౌడ్ ,నాయకులు శ్రీనివాస్, గంగారాం, స్వామి తదితరులు పాల్గొన్నారు.