– రీ సర్వేకు ప్రజలు డిమాండ్
– ప్రజల అభిప్రాయాన్ని వినని అధికారులు
– అర్హులుగా గుర్తించాలని కన్నీరు పెడుతున్న మహిళలు
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా కు సంబంధించిన భూములను వ్యవసాయ రెవెన్యూ అధికారులు సక్రమంగా సర్వే చేయలేదని గువ్వలోనిపల్లి గ్రామ ప్రజలు ఆరోపించారు. ఉప్పునుంతల మండలం పరిధిలోని గువ్వలోనిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ప్రజాపాలన గ్రామసభ శుక్రవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన పథకాలలో భాగంగా ముందుగా ఇందిరమ్మ ఇండ్లు లిస్టును అధికారులు చదవగా అందులో పూర్తిగా సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉన్న కుటుంబాల పేర్లు రాలేదని గ్రామసభ ప్రారంభంలోనే గ్రామస్తులు అధికారులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. సర్వే సరిగ్గా చేయలేదని గ్రామస్తులు ఆరోపించారు. తర్వాత రైతు భరోసా వచ్చే లిస్టును పేర్లను కూడా అధికారులు చదివి వినిపించారు. ఈ లిస్టులో ఏమైనా అనుమానాలుంటే మరో రెండు రోజుల్లో గ్రామ కార్యదర్శికి రాసి ఇవ్వాలని గ్రామస్తులకు వారు సూచించారు. భూముల సర్వే సమగ్రంగా చేయలేదని ఆరోపణలు సూచించారు. తదనంతరం గ్రామస్తులు పలు ఆరోపణలు చేశారు. దరఖాస్తు చేసుకున్నా పేర్లు రాని లబ్దిదారులు మరల దరఖాస్తు చేసుకోవచ్చని మండల ఎంపీ ఓ నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, ఈజీఎస్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.