నవతెలంగాణ – కమ్మర్ పల్లి
సంక్షేమ పథకాలకు నిజమైన అర్హులను గుర్తించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం గ్రామాల్లో గ్రామసభలను నిర్వహిస్తుందని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నాగాపూర్, కమ్మర్ పల్లి, చౌట్ పల్లి, అమీర్ నగర్, కోన సముందర్, నర్సాపూర్ గ్రామాల్లో ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ సభలను నిర్వహించారు. కమ్మర్ పల్లి, నాగపూర్ గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేయ తలపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు, రైతు భరోసా పథకాలకు అర్హులను గుర్తించేందుకే గ్రామ సభలను అధికారులు నిర్వహిస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, జాబితాలో పేరు లేకపోయినంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులుగా ఉండి జాబితాలో పేరు లేకపోతే మరోమారు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఆయా గ్రామసభల్లో పంచాయతీ కార్యదర్శులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన సర్వేలో అర్హులుగా గుర్తించిన లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు. అనంతరం గ్రామసభలకు హాజరైన ప్రజల సమ్మతితో అర్హుల జాబితాను ఆమోదించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, తహసిల్దార్ ఆంజనేయులు, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శరత్, మండల వ్యవసాయ అధికారిని రాజశ్రీ, పంచాయతీ కార్యదర్శులు గంగా జమున, నవీన్, జులేఖ, శాంతి కుమార్, శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి టీచర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆయా పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.