– ప్రభుత్వ పథకాలు రావని ఆందోళన వద్దు. .
– మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్.
నవతెలంగాణ – రాయపోల్
రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే పథకాల కోసం జాబితాను ప్రదర్శించడం జరుగుతుందని ఆ జాబితాలో పేర్లు రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్లు లేనివారు ఆందోళన చెందవద్దని మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్, ఎంపీడీవో బాలయ్య, తహసిల్దార్ దివ్య,ఎంపీవో శ్రీనివాస్ అన్నారు. గురువారం రాయపోల్ మండలంలోని చిన్న మాసాన్ పల్లి,టెంకంపేట, కొత్తపల్లి,రాంసాగర్ గ్రామాలలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నాలుగు పథకాలను అర్హులైన వారికి అందించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. జాబితాలో ఉన్న వారి పేర్లను గ్రామసభలలో చదివి వినిపించారు. గ్రామాలలో గ్రామసభలలో నిజమైన అర్హుల లేదు జాబితాలో లేవని అనర్హుల పేర్లు జాబితాలో రాకపోవడంతో ప్రజలు అధికారులు నిలదీశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అనర్హుల పేర్లు ఉన్నాయని, భూమి లేక జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందించాలని అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసే ఉండాలనే నిబంధన తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలన్నారు. కొత్తపల్లి గ్రామంలో ప్రజలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో గ్రామ సభ పూర్తి కాకుండానే ముగించి అధికారులు వెళ్లిపోయారు. గ్రామస్థాయిలోనే గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందే అర్హుల జాబితాను ఎంపిక చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోలు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.