– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 21 నుండి 23వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ గ్రామ సభలు పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఇప్పటికే శాఖల వారీగా ఏర్పాటు చేసిన టీం వారిగా ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం మండలంలో మూడు టీం లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి టీంలో తహసిల్దార్ ఆంజనేయులు, మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షకులు బి. చంద్రశేఖర్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్యామ్ ఉంటారని తెలిపారు. రెండవ టీంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్, మూడవ టీంలో తహసిల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ శివ జ్యోతి, మండల పంచాయతీ అధికారి సదాశివ్, వ్యవసాయ విస్తీర్ణ అధికారిని లావణ్య ఉంటారని పేర్కొన్నారు.గ్రామసభల నిర్వహణలో భాగంగా మొదటి టీం పర్యవేక్షణలో ఈనెల 21న చౌట్ పల్లి, అమీర్ నగర్, 22న హాస కొత్తూర్, బషీరాబాద్ గ్రామాలలో గ్రామసభలు జరుగుతాయని తెలిపారు. రెండవ టీం పర్యవేక్షణలో ఈనెల 21న కమ్మర్ పల్లి, నాగపూర్, 22న ఉప్లూర్, రాజరాజేశ్వరి నగర్ గ్రామాలలో గ్రామసభలు జరుగుతాయి. మూడవ టీం పర్యవేక్షణలో 21న కోన సముందర్, నర్సాపూర్, 22న ఇనాయత్ నగర్, దొమ్మరి చౌడు తండా, 23న కోనాపూర్, కొత్తచెరువు తండా గ్రామాలలో గ్రామసభలు జరుగుతాయని ఎంపీడీవో తెలిపారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్-గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించి, నివేదికలను అందజేయాలని ఆయన సూచించారు. గ్రామ సభల నిర్మాణ కోసం గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.