నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న ప్రజాపాలన గ్రామసభలు గందరగోళం మధ్యే కొనసాగుతున్నాయి. మండలంలో రెండవ రోజు బుధవారం హాస కొత్తూర్, ఉప్లూర్, రాజ రాజేశ్వరి నగర్, బషీరాబాద్, ఈనాయత్ నగర్, దొమ్మరి చౌడు తండా గ్రామపంచాయతీలో గ్రామ సభలో జరిగాయి. గ్రామ సభల్లో అధికారులు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుబంధు, రేషన్ కార్డుల పథకాలకు అర్హుల పేర్లను సభలో చదివి వినిపించారు. అధికారం వెల్లడించిన జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు అధికారులను నిలదీశారు. అర్హులైన ప్రజలు మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించడంతో, ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలు అధికారులపై మండిపడ్డారు.హాసకోత్తుర్ లో గ్రామానికి మంజూరైన ఇండ్లు గురించి ప్రశ్నించారు. దీంతో అధికారులు నీళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లు మాత్రమే సభలో చదివి వినిపించారు. దీంతో అర్హుల జాబితాను వెల్లడించకుండా, దరఖాస్తు చేసుకున్న అందరి పేర్లు చదవడం ఏంటని నిలదీశారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతుబంధు ఈ సంవత్సరము 150 ఎకరాలకు సాగు లేని భూములకు ఇవ్వడం లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఆ రైతులు పెద్ద ఎత్తున అధికారులతో వాగ్వాదానికి దిగారు. అన్ని గ్రామాల్లో గ్రామసభలు తూతు మంత్రంగానే కొనసాగాయి.కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, తహసిల్దార్ ఆంజనేయులు, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శరత్, మండల వ్యవసాయ అధికారిని రాజశ్రీ, పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి టీచర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆయా పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.