
భోగి పండగ వేడుకలను మండల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేకువ జాముననే పలు వీధులలో భోగి మంటలు వేసి భోగి పండుగను ప్రారంభించారు. మహిళలు కోడికూతకు ముందే లేసి ముంగిళ్లను చక్కగా ఊకి, కల్లాపు చల్లి వాకిళ్ల లో రంగురంగుల ముగ్గులు వేసి పవిత్రంగా ఆవుపేడతో తయారుచేసిన గొబ్బెమ్మలను అందులో ఉంచి నవధాన్యాలు, గరికపోస , పిండి పూలతో అలంకరించి గొబ్బి పాటలను పాడారు. మంగళ స్నానాలు ఆచరించి సమీపంలోని దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మకర సంక్రాంతి మంగళవారం కనుము పండగలను కూడా విశిష్టంగా నిర్వహిస్తామని మహిళలు తెలిపారు. సెలవులు కావడంతో పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మైదాన ప్రాంతాల్లో పతంగులను ఎగురవేస్తూ ఆహ్లాదంగా గడిపారు. పతంగుల ఎగిరేతలు పిల్లలు ఏమన్నా అశ్రద్ధ వహిస్తారేమోనని పెద్దలు కూడా వారిని వెంటనే ఉండారు. హరిదాసులు గంగిరెద్దులు మచ్చుకైన కానరాలేదు. పలు యువజన సంఘాలు రాజకీయ పార్టీలు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అర్ధరాత్రి నుండి ఒకరినొకరు సోషల్ మీడియాలో వాట్సాప్ లలో బ్యానర్ల ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.