ఏ కేటగిరీకి నామినేట్‌ కాని ఏకైక ఆస్కార్‌ చిత్రం గ్రాండ్‌ హోటల్‌

విక్కీ బామ్‌ అనే ఆస్ట్రియన్‌ రచయిత్రి రాసిన ‘మెన్చెన్‌ ఇన్‌ హోటెల్‌’ అనే నవలను 1929లో ప్రచురించారు. ఇది ”పీపిల్‌ ఎట్‌ హోటల్‌” పేరుతో ఇంగ్లీషులోకి అనువాదం అయింది. ఈ నవల రచయిత్రికి ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది. 1930లో దీన్ని నాటకంగా ప్రదర్శించినప్పుడు 400 పైగా ప్రదర్శనలతో విశేష ప్రజాదరణను చవిచూసింది. ఆ అనుభవంతో ఎమ్‌.జీ.ఎమ్‌. సంస్థ 1932లో ఇదే కథను సినిమాగా మలిచింది. దీనికి దర్శకులు ఎడ్మండ్‌ గౌల్డింగ్‌. ఈ సినిమా తరువాత ఆయన హాలీవుడ్‌లో పెద్ద దర్శకుల సరసన చేరారు. ఆ తరువాత కాలంలో కూడా ఈ కథను ఇంగ్లీషుతో పాటు ఇతర భాషలలోనూ రీమేక్‌ చేశారు.

‘గ్రాండ్‌ హోటల్‌’ లో గ్రేటా గార్బో, జాన్‌ బారీమోర్‌, జొయాన్‌ క్రాఫోర్డ్‌ ప్రధాన తారాగణం. ఇందులో గ్రేటా గార్బో ఓ సందర్భంలో చెప్పిన ”ఐ వాంట్‌ టూ బీ అలోన్‌” (నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను) అనే డైలాగ్‌, సినీ చరిత్రలో అతి ప్రాచుర్యం పొందింది. ప్రపంచ సినిమాలలోని గొప్ప డైలాగ్‌గా దీన్ని ప్రస్తావిస్తారు. డిప్రెషన్‌లో ఉన్న ఆర్టిస్టుగా ఆమె నటన విశ్లేషకుల ప్రశంసలు పొందింది. గొప్ప సెలబ్రటీల జీవితాల్లో విషాదాన్ని ప్రస్తావించే క్రమంలో ఈ పాత్రను ఎందరో గుర్తు చెసిన సందర్భాలు అనేకం.
బర్లిన్‌లో అతి పెద్ద హోటల్‌ ‘గ్రాండ్‌ హోటల్‌’. సామాన్యులెవ్వరూ తొంగి చూడలేని అద్భుత ప్రపంచం అది. సినిమా కథ ఈ హోటల్‌లో బస చేసిన కొందరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. డాక్టర్‌ ఆటమ్‌ ష్లాగ్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి. ఇతను గ్రాండ్‌ హోటల్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. ఆ హోటల్‌కి వచ్చి పోయే వారిని గమనించడం ఇతని దినచర్య. కథ ఆటం ష్లాగ్‌ చెప్తుండగా ఒకో పాత్రను మనకు పరిచయం చేస్తుంది. బారోన్‌ ఫెలిక్స్‌ తన ఆస్థి అంతా పోగొట్టుకుని దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటాడు. అతని ఆర్ధిక స్థితి ఎవరికీ తెలీదు. అతను అందగాడు సంస్కారవంతుడు కూడా. అందువలన అతనికి ఆ హోటల్‌లో ప్రత్యేక హోదా ఇస్తారు సిబ్బంది. కాని అతను అక్కడ చేరింది దొంగతనం కోసం. అప్పులవారి నుండి తప్పించుకోవడానికి దొంగతనం ఒక్కటే అతనికి మిగిలిన మార్గం.
ఆటో క్రింగ్లీన్‌ అనే ఓ పేద అకౌంటెంట్‌ తాను ఎక్కువ రోజులు బ్రతకనని తెలుసుకుంటాడు. జీవితం ఆఖరి రోజుల్లో సంపాదించినదంతా ఆనందంగా ఖర్చు చేయాలని ఈ హోటల్‌లో దిగుతాడు. అతని వేషం, ప్రవర్తనతో ఇలాంటి హోటల్‌ను అతను అంతకు ముందు ఎప్పుడూ చూడలేదని అందరికీ అర్దం అవుతుంది. బారొన్‌ ఒక్కడే ఇతనితో స్నేహం చేస్తాడు, ప్రేమగా మాట్లాడతాడు. బారొన్‌ డబ్బును బట్టి మనుష్యులకు గౌరవం ఇచ్చే వ్యక్తి కాదని ఆటో అర్ధం చేసుకుంటాడు. ఈ కొత్త స్నేహితుడిని గౌరవిస్తాడు. మనసులోని బాధని, ఒంటరితనాన్ని బారొన్‌తో పంచుకుంటాడు.
ఆటో అప్పటిదాకా పని చేసినది జనరల్‌ డైరెక్టర్‌ ప్రేసింగ్‌ వద్ద. ఇతనో పక్కా వ్యాపారవేత్త. తన లాభం తప్ప మరో విషయాన్ని పట్టించుకోని అహంకారి. వ్యాపార సంబంధిత పని కోసం అతను కూడా అదే హోటల్‌లో బస చేస్తాడు. అతని వద్ద పనిచేయడానికి ప్లాంచెన్‌ అనే స్టేనోగ్రాఫర్‌ వస్తుంది. చిన్న ఉద్యోగం చేసుకుని జీవించే ఆమెకూ ఈ హోటల్‌ ఓ కొత్త ప్రపంచం. అందుకే అక్కడ ఎంతో ఒంటరితనం అనుభవిస్తుంది. బారొన్‌ మంచితనం, కలుపుగోలుతత్వం ఆమెను ఆకర్షిస్తాయి. అతనొక్కడే ఆమెకు అక్కడ ఆత్మీయుడిగా కనిపిస్తాడు.
మరోగదిలో రష్యన్‌ బాలరీనా గ్రుసిన్స్కాయా తన పరివారంతో దిగుతుంది. ఆమె అ నగరంలో ప్రదర్శన కోసం వస్తుంది. కాని ఎప్పుడూ తననో మరబొమ్మగా చూసే వారి మధ్య, డబ్బు కోసం ఆమెను సంప్రదించకుండా ఒప్పుకున్న నాట్య ప్రదర్శనల నడుమ ఆమె అలసిపోతుంది. ఇక ఇలా జీవించలేననే ఆలోచన ఆమెకు కలుగుతుంది. ఆ హోటల్‌లో ఆత్మహత్య చేసుకోవాలన్నది ఆమె ఆలోచన. ఆమె డబ్బు, డాబు చూసి విస్మయం ప్రదర్శించే వారికి ఆమెలోని ఈ ఒంటరితనం కనిపించదు. చుట్టూ అందరూ, అన్నీ ఉన్నా ఎవరూ లేని పేదరాలిగా దు:ఖంతో రగిలిపోతుంటుంది గ్రుసిన్స్కాయా.
జూదంలో డబ్బు పోగొట్టుకున్న బారొన్‌ మీద అప్పు తీర్చాల్సిన ఒత్తిడి ఉంటుంది. అందుకని ఆ హోటల్‌లో ధనవంతుడిగా తిరుగుతూనే దొంగతనం చేయాలన్నది అతని ఆలోచన. అందుకే గ్రుసిన్స్కాయా తన పరివారంతో బైటికి వెళ్ళాక, ఆమె గదిలోకి దూరతాడు. విలువైన ఆమె నగలను దొంగలిస్తాడు. కాని అనుకోకుండా అప్పుడే గ్రుసిన్స్కాయా ఒంటరిగా గదిలోకి తిరిగి వస్తుంది. ఎవరూ లేని ఆ సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకుని ఆ ప్రయత్నంలో ఉంటుంది. గదిలో చాటున ఉండి ఇదంతా గమనిస్తున్న బారొన్‌ ఆమెను ఆపుతాడు. ఆమె ఒంటరితన్నాన్ని అర్ధం చేసుకున్న ఆతను ఆమెతో సంభాషణ మొదలెడతాడు. మనసు విప్పి మాట్లాడడం మర్చిపోయిన గ్రుసిన్స్కాయాకు ఇదో కొత్త అనుభవం. అతను ఎవరు, ఎందుకు తన గదిలో ఉన్నాడన్న సంగతి కూడా గుర్తించకుండా అతనితో తన మనసు విప్పి మాట్లాడుతుంది. ఆ సంభాషణ మధ్య ఒకరిపై మరొకరికి ప్రేమ చిగురిస్తుంది. తెల్లవారిన తరువాత… తాను ఒక దొంగనని, దొంగతనం కోసమే ఆ గదిలోకి వచ్చానని చెబుతాడు బారొన్‌. తాను దొంగలించిన నగలను తిరిగి ఇచ్చేస్తాడు. గ్రుసిన్స్కాయా ఆశ్చర్యపోతుంది. కాని అతనిలోని మంచితనం, అతని సాంగత్యంలో తాను అనుభవించిన దగ్గరితనం, బారొన్‌పై ఆమెలో నమ్మకం కలిగిస్తాయి. బారొన్‌ను క్షమించి అతన్ని తనతో వియన్నా వచ్చేయమని అడుగుతుంది గ్రుసిన్స్కాయా. తన పాత జీవితం నుంచి తప్పుకునే మహదావకాశంగా బారొన్‌ దీనికి అంగీకరిస్తాడు. గ్రుసిన్స్కాయాపై మనసులో కలిగిన ప్రేమ అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. జీవితం పట్ల ఆశ కలిగిస్తుంది. అందుకే తాను ఆమెను రైలులో కలుస్తానని మాట ఇస్తాడు బారొన్‌.
ఇప్పుడు అతనికున్న ఏకైక ఆలోచన ఆ అప్పు నుండి బైటపడి కొత్త జీవితం వైపుకు అడుగులు వేయడం. చిట్టచివరిసారి దొంగతనం చేయాలని అతను నిశ్చయించుకుని అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. ఆటో తాను జీవితంలో దాచి పెట్టుకున్నదంతా ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అందుకని బారొన్‌తో కలిసి పేకాట మొదలెడతాడు. బారొన్‌ సహాయంతో అతను చాలా డబ్బు గెలుచుకుంటాడు. ఆనందంతో తాగుతాడు. మత్తులో ఉండగా అతని పర్సు పడిపోతుంది. బారొన్‌ ఆ పర్సు తీసుకుంటాడు. దానితో అతని సమస్య తీరిపోతుందని అతనికి తెలుసు. ఆ అవకాశం కోసమే అతను రోజంతా ఎదురు చూస్తున్నాడు. కాని పర్సు పోయిందని తెలుసుకున్న ఆటో దాని కోసం పిచ్చివాడిలా వెతుకుతాడు. పేదవాడికి డబ్బు జీవితంలో పెద్ద బలం. అది కోల్పోయిన తరువాత అతనిలో ఏర్పడిన భయం, అసహాయత చూసిన బారొన్‌ తట్టుకోలేకపోతాడు. పర్సు తనకు దొరికిందని చెప్పి ఆటోకి దాన్ని తిరిగి ఇచ్చేస్తాడు.
ప్లాంచెన్‌ సినీనటి కావాలని కలలు కంటుంది. అందరి ఆడపిల్లల వలే తనకో అందమైన భర్త, అందమైన జీవితం కోరుకుంటుంది. కాని బతకడానికి స్టేనోగ్రాఫర్‌గా మారి పక్కా వ్యాపారస్తుల వద్ద పని చేయడం ఆమెకు అవసరం అవుతుంది. తనని పొందాలని చూసే ప్రేసింగ్‌ను తప్పించుకుని ఆమె బారొన్‌ ప్రేమ కోరుకుంటుంది. కాని అతను తనకు దక్కడని ఆమెకు అర్ధం అవుతుంది. కాని బారోన్‌ మంచితనం, మనుష్యులను ప్రేమించే గుణం అతని పట్ల ఆమెకు గౌరవం కలిగిస్తాయి. ఏ అండా లేని ఆమె ప్రేసింగ్‌కు లొంగిపోవాలని నిశ్చయించుకుంటుంది. అతని ఉద్దేశం తెలిసి కూడా అతను నిర్దేశించిన గదిలోకి మారుతుంది. వ్యాపారసంబంధ లావాదేవీల కోసం ప్రేసింగ్‌ లండన్‌ వెళ్ళే ప్రయత్నంలో ఉంటాడు. ఆ సమయంలో బారొన్‌ ప్రేసింగ్‌ గదిలోకి దొంగతనం కోసం వెళ్తాడు. ప్రేసింగ్‌ ఇది గమనించి బారోన్‌ని పట్టుకుంటాడు. తోపులాట మధ్య ఫోన్‌తో బలంగా బారొన్‌ తలపై ప్రేసింగ్‌ కొట్టడంతో అతను మరణిస్తాడు. ఇది చూసి తట్టుకోలేని ప్లాంచెన్‌ ఆటోకి తాను చూసినది చెబుతుంది. ఆటో పోలీసులకు పోన్‌ చెయడంతో వారు వచ్చి హత్యానేరంపై ప్రేసింగ్‌ ను అరెస్ట్‌ చేస్తారు.
ప్రదర్శన ముగించుకుని వచ్చిన గ్రుసిన్స్కాయా బారొన్‌ కోసం వెతుకుంతుంది. అతను చనిపోయాడని ఆమె పరివారానికి తెలుసు. కాని ఈ విషయం తెలిస్తే ఆమె రైలు ఎక్కదని తెలిసి, వాళ్లు ఆమె నుండి ఈ నిజం దాచి హడావిడిగా ఆమెను స్టేషన్‌కు తీసుకుని వెళ్ళిపోతారు. బారొన్‌ కోసం ఎదురు చూస్తూ అతను తన కోసం రైలులోకి ముందే ఎక్కి ఎదురు చూస్తూ ఉంటాడన్న ఆశతో గ్రుసిన్స్కాయా హోటల్‌ నుండి బైలుదేరుతుంది.
ప్లాంచెన్‌, ఆటోలు తాము ఒకే వర్గానికి చెందిన వారమని అర్ధం చేసుకుంటారు. ప్లాంచెన్‌ను తనకు తోడుగా రమ్మని అడుగుతాడు ఆటో. ఏ నీడా లేని ఆమె సంతోషంగా దీనికి ఒప్పుకుంటుంది. అతని జబ్బుకు వైద్యం చేయించుకోవచ్చని, కలిసి ప్రయత్నిద్దామని అతనికి తోడుగా నిలబడతానని వాగ్దానం చేస్తుంది. ఆటోకు కొత్త ఆశ కలుగుతుంది. ఇద్దరూ ఆనందంగా హోటల్‌ ఖాళీ చేసి ఒకటిగా అందమైన భవిష్యత్తులోకి ప్రయాణించడానికి వెళ్లిపోతారు. వీరు ఖాళీ చేసిన గదులలోకి కొత్తవాళ్లు వచ్చి చేరుతారు. వ్యక్తులు రావడం పోవడం అక్కడ మామూలే. ఎవరూ స్థిరంగా ఉండరు. వారి జీవితాలు ఏ దిశగా ప్రయాణిస్తాయో అటువైపుకు వెళ్ళే క్రమంలో కాస్త విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఈ గ్రాండ్‌ హోటల్‌. తరువాత వారి గదులలోకి మరెవ్వరో, ఆ తరువాత మరెవ్వరో. ఈ ప్రక్రియ ఇలా నిరంతరం సాగిపోతూనే ఉంటుంది అంటూ అప్పటికి కథను ముగిస్తాడు డాక్టర్‌.
ఆరు పాత్రలను తీసుకుని వారి మధ్య నడిచే సన్నివేశాలను ఒకే ఫ్రేంలో చూపించడం ఆ రోజుల్లో గొప్ప విషయం. హోటల్‌ను నేపధ్యంగా తీసుకుని విభిన్నమైన పాత్రలను ఒకేసారి చూపిస్తూ, ఆ పాత్రల విరుద్ధమైన ప్రపంచాలను ఒకేసారి ప్రేక్షకులకు పరిచయం చేసే కథనశైలి సినిమా ప్రపంచానికి అప్పట్లో సరికొత్త ప్రయోగం. గ్రాండ్‌ హోటల్‌ సినిమాను ఈ కథనశైలి కోసమే ఈ రోజుకీ ప్రస్తావిస్తారు. పైగా ఇంతమంది నటులకు ఒకే రకమైన ప్రాధ్యానంతో సినిమాను నడిపించడం కూడా ప్రేక్షకులకు కొత్త అనుభవం. ఆ తరువాత ఇలా ఒకే నేపధ్యంలో వేర్వేరు కథలను చెప్పే పద్ధతిని ‘గ్రాండ్‌ హోటల్‌ స్టైల్‌’ అని సినిమా భాషలో ఉపయోగించడం మొదలయింది. జిరాఫీ క్రేన్‌ అనే కొత్త రకం కెమెరాతో షూట్‌ చేసిన మొదటి సినిమా గ్రాండ్‌ హోటల్‌. మానవ స్వభావాన్ని, మంచి చెడుల మధ్య ఉండే ఆ సన్నటి విభజన రేఖను చూపిన మొదటి సినిమా ఇది.
చనిపోతున్నానని ఇక తనకు జీవితం లేదనే నిరాశతో ఆ హోటల్‌కు వచ్చిన ఆటో జీవితంపై ఆశ పెంచుకుని తిరిగి వెళ్లిపోతాడు. దొంగగా బ్రతుకుతున్నా మానవత్వం మెండుగా ఉన్న బారొన్‌, ప్రేమను పొంది కూడా అది అందుకోలేక దురదృష్టవంతుడిగా మిగిలిపోతాడు. గొప్ప వ్యాపారవేత్తగా ప్రపంచాన్ని శాసించే వ్యక్తిగా ఆ హోటల్‌లో కాలు పెట్టిన ప్రేసింగ్‌ దోషిగా పోలీసులకు పట్టుబడి అన్నీ కోల్పోయి జైలుపాలవుతాడు. అతన్నిచూసి ఎప్పుడూ భయంతో బతికే ఆటోనే చివరకు అతన్ని పోలీసులకు పట్టించి, తన అధికారికే ఆ క్షణాన అధికారిగా మారతాడు. బలవంతులు బలహీనులుగా, అదష్టవంతులు అంతలోనే సర్వం కోల్పోయిన దురదృష్టవంతులుగా, ఏ ఆశ లేని వారు చిగురించి ఆశతో భవిష్యత్తు వైపుకి ప్రయాణం చేస్తూ మనిషి విధి చేతిలో ఆటబొమ్మ అనే నిజాన్ని గుర్తు చేస్తూండగా ఈ సినిమా ముగుస్తుంది.
1932 లో ఉత్తమ చిత్రంగా ఈ ప్రీ కోడ్‌ సినిమా బహుమతి గెలుచుకున్నప్పుడు ఇది మరే ఇతర విభాగంలో నామినేట్‌ కాలేదు. అయినా నామినేట్‌ అయిన మిగతా ఏడు సినిమాలను దాటి ఉత్తమ చిత్రంగా ‘గ్రాండ్‌ హోటల్‌’ ఆస్కార్‌ గెలుచుకుంది. ఇతర విభాగాల్లో కనీసం నామినేట్‌ కాకుండా ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ గెలుచుకున్న ఏకైక చిత్రంగా ‘గ్రాండ్‌ హోటల్‌’ చరిత్రలో నిలిచిపోయింది.

– పి.జ్యోతి,
98853 84740