వైభవంగా రేవు ఆడియో ఆవిష్కరణ వేడుక

Grand launch of Revu Audioవంశీ రామ్‌ పెండ్యాల, అజరు, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌, పారుపల్లి ప్రొడక్షన్‌ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్‌ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ సూపర్‌ విజన్‌ జర్నలిస్ట్‌ ప్రభు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా ఫిలిం జర్నలిస్ట్‌ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్‌ పులి దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఆగస్టు రెండో వారంలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గీత రచయితలు చంద్రబోస్‌, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంత్‌ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్‌ అతిథులుగా ఈ చిత్ర ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. గీత రచయిత చంద్రబోస్‌ మాట్లడుతూ, ‘ఈ సినిమాకు పాటలు రాసిన ఇమ్రాన్‌ శాస్త్రి పేరు ఎంత వైవిధ్యంగా ఉందో, అతను రాసిన పాటలు అంతే వైవిధ్యంగా ఉన్నాయి. అన్ని ఎమోషన్స్‌తో పాటలు రాశారు. సంగీతం బాగుంది. ఈ సినిమాలో నవ్యత, నాణ్యత రెండూ కనిపించాయి’ అని అన్నారు. ‘ఈ సినిమాలోని పాటల విన్నాక ఒక ఉద్విగతకు లోనయ్యాను. అంత బాగున్నాయి’ అని మరో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి చెప్పారు. గీత రచయిత అనంత శ్రీరామ్‌ మాట్లాడుతూ, ‘గీత రచయితగా ఇమ్రాన్‌ శాస్త్రి నాలాగే మొదటి సినిమాకే సింగిల్‌ కార్డ్‌ రాసే అవకాశం దక్కించుకున్నారు. జాన్‌ సంగీతం బాగుంది. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. గీత రచయిత సుద్దాల అశోక్‌ తేజ మాట్లాడుతూ, ‘రేవు సినిమా కార్యక్రమం చూస్తుంటే కొత్త నెత్తుటి సముద్రం చూస్తున్నట్లు ఉంది. నేను తీరప్రాంతంలో పుట్టలేదు కానీ తీరప్రాంత ప్రజల గురించి తెలుసు. వారి జీవన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా వేదిక మీద అక్షరాలన్నీ కలిపినట్లు ఉంది’ అని అన్నారు. ‘ఈ సినిమా పెద్ద కమర్షియల్‌ హంగులు ఉన్న మూవీ కాదు. ఇదొక జీవన పోరాటం. మత్య్సకారుల జీవితాలను తెరపై చూపిస్తుంది’ అని నిర్మాణ పర్యవేక్షకులు ప్రభు చెప్పారు. గీత రచయిత కాసర్ల శ్యామ్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా లిరిసిస్ట్‌ ఇమ్రాన్‌ శాస్త్రి, మ్యూజిక్‌ చేసిన జాన్‌…ఈ ఇద్దరిలో అన్ని మతాలు ఉన్నాయి. అందుకే అన్ని వర్గాల వారికీ నచ్చేలా పాటలు రూపొందించారు’ అని తెలిపారు. ‘ఈ వేదిక మీద ఆస్కార్‌ నుంచి అన్ని ప్రతిష్టాత్మక అవార్డులు ఉన్నట్లు భావిస్తున్నా’ అని చిత్ర గీత రచయిత ఇమ్రాన్‌ శాస్త్రి చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ, ‘రేవు సినిమాకు మా మిత్రులు మురళీ గింజుపల్లి, నవీన్‌ పారుపల్లి నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తున్నాం. ఈ మూవీ మంచి సక్సెస్‌ కావాలని, ఈ బ్యానర్‌లో మరిన్ని ప్రాజెక్ట్స్‌ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘మత్స్య కారుల జీవితాలను ప్రతిబింబించేలా రూపొందించాను. ఈ సినిమాలో స్టార్‌ కాస్ట్‌ ఎవరూ లేరు’ అని దర్శకుడు హరినాథ్‌ పులి చెప్పారు.